calender_icon.png 23 October, 2024 | 8:52 PM

బాబు దొర పాపం పండింది ఇలా..

17-09-2024 04:52:39 AM

  1. ప్రజలే కొడవళ్లు, గొడ్డళ్లతో నరికారు.. 
  2. చచ్చాక మృతదేహంపై ఉమ్మేశారు..

జనగామ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నిజాం ప్రభుత్వం, రజాకార్ల తర్వాత తెలంగాణ ప్రాంతంలో నాడు ఎక్కువగా వినిపించిన పేరు దేశ్‌ముఖ్ విస్నూరు దొర రామచంద్రారెడ్డిది. ఆయన గుప్పిట్లో సుమారు 60 గ్రామాలు ఉండేవి. ఆయన పేరు వింటేనే గ్రామాలు హడలిపోయేవి.. తండ్రికి తగ్గ కోపిష్టిగా చిన్న కొడుకు జగన్మోహన్‌రెడ్డికి ఆ పేరు ఉండేది. ఆయన్ను నాడు బాబుదొర అని పిలిచేవారు. ఎవరైనా దొరలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎదురుతిరిగినా బాబుదొర మనుషుల్ని తుపాకులతో పిట్టల్లా కాల్చేవాడు. అలాగే ఓ రోజు కోలుకొండలో 40 ఇండ్లను తగులబెట్టించాడు. ముగ్గురిని తుపాకీతో కాల్చి చంపాడు. ఇలా ఎంతోమందిని పొట్టపెట్టుకున్నాడు. దీంతో బాబు దొరను ఎలాగైనా మట్టుపెట్టాలని గ్రామ రక్షక దళాలు నిర్ణయించాయి.

1948 సెప్టెంబర్ 15న నిజాం రాజ్యంపై సైనిక చర్య జరుగుతుండగా.. బాబుదొర హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లడానికి ముందు కోడూరులో ఐదుగురు దళ సభ్యులను కాల్చి చంపాడు. తరువాత జనగామకు బయల్దేరాడు. దారిలో వేలాది మంది జనాన్ని చూసి బాబుదొర జనగామ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. సుమారు 3 వేల మంది ప్రజలు పోలీస్ స్టేషన్ వైపు కదిలారు. ప్రాణభయంతో బాబు దొర పోలీసుల రక్షణలో రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు ఎక్కి హైదరాబాద్ పారిపోయేందుకు వేచి చూస్తుండగా అప్పటికే అక్కడికి వచ్చిన జనం ప్లాట్‌ఫాం పైనుంచి బాబుదొరను పట్టాలపైకి తోసేశారు.

మ చేతిలో ఉన్న కర్రలు, కొడవళ్లతో బాబు దొరను నరికి చంపారు. అక్కడికి వచ్చిన వేలాది జనం బాబుదొర శవంపై ఉమ్మేయగా.. మరికొందరు మృతదేహంపై మూత్రం పోసి కసి తీర్చుకున్నారు. దీన్ని బట్టి బాబు దొరపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న దర్గ్యానాయక్ అనే వృద్ధుడు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు 106 ఏళ్లు. ఆయన ప్రస్తుతం హనుమకొండలో ఉంటున్న తన కుమారుడి వద్ద ఉంటున్నాడు.