06-03-2025 01:12:39 AM
సిద్దిపేట, మార్చి 5 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటిని తీసుకువెళ్తున్నాని, తెలంగాణ, ఏపీ రెండు కళ్ల లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరు కుంటున్నానని చెప్పడం సత్యదూరమని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
బుధవా రం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన హరీశ్‌రావు విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం, కేంద్రంలోని బిజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. కేసీఆర్ శక్తియుక్తులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారని, ఇప్పుడు చంద్రబాబు అక్కసుతో ఆ అనుమతులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాశారని హరీశ్‌రావు వాటిని చూపించారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు కేంద్రంతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం లేదని విమర్శించారు. రెండు రాష్ట్రాలు చంద్రబాబు కు రెండు కళ్లు అయితే, నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, సాగర్ కుడి కాల్వ నుంచి నిండుగా నీళ్లు ఎలా తీసుకుపోతున్నారని మండిపడ్డారు.
కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన వాటా ప్రకారం 512 టీఎంసీలు రావాల్సి ఉండగా, 655 టీఎంసీల నీరు వాడారని, తె లంగాణకు 343 టీఎంసీ రా వాలి కాని, వచ్చింది 220 టీ ఎంసీలేనని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు తీసు కుపోతున్నారని.. తెలంగాణకు నీరు లేకుండా చేస్తు న్నారన్నారు. సీఎం దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టంపాడు, కోయల్‌సాగర్, బీమా కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు.
కేసీఆర్ కృషి ఫలితమే ‘సీతారామ’
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణా జలాలను ఆంధ్రా తరలించుకుపోతున్న పరిస్థితి తలెత్తిందన్నారు.
ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడమేనని స్పష్టం చేశారు. దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా (90%)శాతం పనులు పూర్తి చేశారని, ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృథా అన్నారని, అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు.
కానీ కేసీఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీపర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫొటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసీఆరే కారణమన్నారు.