calender_icon.png 24 December, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబోయ్ శునకాలు

19-07-2024 12:00:00 AM

తెలంగాణలో మళ్లీ వీధికుక్కల దాడుల బెడద పతాక శీర్షికలకెక్కుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఏడాదిన్నర చిన్నారిని వీధికుక్కలు పీక్కుతిన్న వార్త యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేయాలని, ఉన్నతస్థాయి కమిటీని ఏర్పరచి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అప్పటికే సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బీహార్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు విశాల్‌పై వీధికుక్కలు దాడి చేసి తల కొరికి చంపేసిన ఘటనను సుమోటోగా విచారణకు చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ దాడుల ఘటనలనూ పరిగణనలోకి తీసుకుంది.

గత అయిదారు నెలలుగా రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓచోట వీధికుక్కల దాడిలో చిన్నారులు, ఒంటరి మహిళలు, వృద్ధులు గాయపడుతూనే ఉన్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 239 కుక్క కాటు ఘటనలు చోటు చేసున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా 10 మంది గాయపడ్డ ఘటనలూ ఉన్నాయి. ఈ ఏడు నెలల కాలంలో కుక్కల దాడిలో 15 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉండడం గమనార్హం. కొందరు రేబీస్ కారణంగా చనిపోయారు. వీధిలో ఆడుకోవడానికి వెళ్లిన ఒంటరి చిన్నారులపై కుక్కలు దాడి చేసి దారుణంగా పీక్కు తింటున్నాయి. గుంపులుగా తిరిగే కుక్కలు మేకలు, గొర్రెలు లాంటి మూగజీవాలపైనా దాడి చేసి చంపేస్తున్నాయి.

నిజానికి వీధికుక్కల బెడద ఇప్పటిది కాదు. గతంలో హైదరాబాద్, అంబర్‌పేటలో వీటి దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందడం ఆందోళనకు దారి తీసింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ శునకాల నియంత్రణకు కమిటీలను నియమించడం, వీటి సంతతి నిరోధక వ్యాక్సీన్లు ఇవ్వడం లాంటి చర్యలతో కొన్ని రోజులు హడావుడి చేశాయి. ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఈ బెడద ఎక్కువ కావడంతో చర్యలు చేపడుతున్నామంటూ అధికారులు పాత పాటే  పాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2007 నాటికి 7.5 లక్షల వీధికుక్కలు ఉండగా స్టెరిలైజేషన్ వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా ఈ సంఖ్య 3.9 లక్షలకు తగ్గిందని గురువారం విచారణ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు హైకోర్టుకు తెలిపారు.

అయితే, కుటుంబ నియంత్రణతో వీధికుక్కలు దాడులను ఎలా అరికడతారంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. నాగపూర్‌లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్స్‌లో పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలతో ఈ అసోసియేన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపాలని న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణ నాటికి స్పష్టమైన పరిష్కారంతో రావాలని స్పష్టం చేసింది.

అసలు గతంలో పెద్దగా లేని వీధికుక్కల బెడద ఇప్పుడే ఎందుకు ఎక్కువయింది? నగరాలు, పట్టణాల్లో జనంతోపాటు హోటళ్లు, మటన్ షాపులు, ఇతర తినుబండారాల దుకాణాలవారు ఆహార వ్యర్థాలను వీధుల్లో ఇష్టారాజ్యంగా పడవేయడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి అవి పరస్పరం పోరాటం చేయడం పరిపాటిగా మారింది. ఒంటరిగా కనిపించే వారిని కూడా అవి ఆహారంగానే చూస్తుండడంతో దాడులు చేస్తున్నాయనే వాదన ఉంది. గతంలో గ్రామాల్లో  వీధికుక్కలు దొంగల నుంచి, అపరిచిత వ్యక్తుల నుంచి రక్షణగా  ఉండేవి. దీంతో జనం కూడా వాటి ఆకలి తీర్చేందుకు ప్రయత్నించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విశ్వాసానికి మారుపేరైన శునకాల ఆకలి తీరిస్తే అవి మనుషులపై దాడులు చేయడం తగ్గిపోతుందని, దీన్ని ఓ సామాజిక బాధ్యతగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు. దీనితోపాటు వాటి సంతతి పెరగకుండా చూడడానికి కుటుంబ నియంత్రణ చర్యలను పకడ్బందీగా చేపట్టాలి. మనల్ని రక్షించుకుంటూ వాటినీ బతకనిద్దాం.