calender_icon.png 12 January, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైస వలలో పసివాళ్లం!

13-07-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

ఇప్పుడైతే రూపాయి, అప్పట్లో పైస! అంతే తేడా. డబ్బు మనుషులతో ఎంతటి పనినైనా చేయిస్తుంది. అది ఎంత సున్నితమైంది అంటే, రెండువైపులా పదునైన కత్తి వంటిది. అందుకే, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. తెలిసో, తెలియకో పొరపాటు జరిగితే చాలా అనర్థాలే జరిగిపోతాయి. ధనం ఎంత గొప్పదంటే మనుషులను కలుపుతుంది, ఎంత చెడ్డదంటే మనలను విడగొడుతుంది కూడా. యాభై ఏండ్ల కిందట ఒక్క పైస కోసం నేను నా చిన్ననాటి ఆప్త మిత్రునికి దూరమయ్యాను. ఆనాడు మేం కోల్పోయిన స్నేహం విలువ ఇంతా అంతా కాదు.

అవి నేను చింతపల్లి హైస్కూల్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న రోజులు. కొన్నాళ్లకే క్లాస్‌మేట్ శాంతిరెడ్డి నాకు మంచి మిత్రుడయ్యాడు. ఇద్దరం 9వ తరగతిలోకి ప్రవేశించాం. ఏ పని చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్లం. కట్టెల పొయ్యిమీద వంట వం డుకోవడం దగ్గర్నుంచి పచ్చళ్లతో భోజనం చేసే వరకు. శాంతిరెడ్డిది బంగారు గడ్డ. ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లమ్మతో సజ్జరొట్టెలు చేయించి తెచ్చేవాడు. అవన్నీ అయి పోయేదాకా అన్నం వండుకొనే వాళ్లం కాదు. చింతపల్లి బ్లాక్ స్థాయి గ్రామం. అప్పుడప్పుడు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలే జరిగేవి. టోర్నమెంట్స్ జరిగేవి. ఆ సందర్భంలో మొదటిసారి నేను ‘అంగూర్’ పళ్లు చూశాను. 

బాల్య మిత్రుల సమైక్యత

ఎప్పటికీ నా జేబులో ఐదారు పైసలు ఉండేవి. అలాగని విచ్చలవిడి ఖర్చు చేసేవాణ్ణి కాదు. ఒక పైస ఇచ్చి ఓ అంగూరు పండు కొనుక్కొని తిన్నాను. శాంతిరెడ్డి కూడా నా సూచన మేరకు ఒక పైసతో అంగూర్ కొన్నాడు. తొమ్మిదో తరగతిదాకా ఆపిల్ పండును మేం చూల్లేదు. టోర్నమెంట్స్ సందర్భంగా అక్కడ ఏర్పాటైన ఒక స్టాల్‌లో ఆపిల్ పండ్లు చూసి ఆశ్చర్యపోయాను. శాంతిరెడ్డి ఒక పండు కొందామంటే నేను ‘సరే’ అన్నాను. నాలుగు పైసలకు ఒక ఆపిల్ పండు వచ్చింది. ఇద్దరం చెరి సగం తిని, తృప్తి పడ్డాం. ఆరు పైసలకు అర్దపావు పెరుగు వచ్చేది. రోజూ తెచ్చుకొనే వాళ్లం. ఇద్దరం చెరిసగం వడ్డించుకునేది. ఏ పని చేసినా కలిసి చేయడమే. ఇదీ మా బాల్యమిత్రుల సమైక్యత. 

బాల్యం ఎంత మంచిదంటే అభం శుభం తెలియని పచ్చని ప్రకృతి వంటిది. మా క్లాసులో ‘సక్కుబాయి’ అనే అమ్మాయి ఉండేది. తొమ్మిది చదువుతుండగానే ఆమెకు పెళ్లయింది. ఆ రోజుల్లో మగపిల్లలం ఆడపిల్లలతో మాట్లాడే వాళ్లం కాదు. మేం ముందు బెంచీలో కూర్చుంటే తాను వెనుక బెంచిలో కూర్చునేది. ఆమెతో మేం ఎన్నడూ మాట్లాడే వాళ్లం కాదు. తన పెళ్లి సంగతికూడా మాకు తెలియదు. ఒక పది రోజులు ఆమె క్లాసుకు రాలేదు. ఎందుకు రాలేదో తెలుసుకునే ప్రయ త్నం మేం చేయలేదు. ఒకరోజు మధ్యాహ్నం క్లాసు అవగానే మా అద్దె గదికి వచ్చాం. ఆ రోజుల్లో అద్దె గదులకు ప్రత్యేకంగా తాళాలు వేసుకొనే వాళ్లం కాదు. మనుషుల మధ్య అంత నమ్మకం మరి! స్కూల్‌కు వెళ్లేప్పుడు తలుపులు వేసి వెళ్లేవాళ్లం. ఆ వేళ మా గదిలో మేం వం డుకున్న అన్నం గిన్నెలో ఒక లడ్డు కనిపించింది.

‘అది ఎక్కడ్నించి వచ్చింది?’ అని ఇంటివారిని అడిగితే, వారు, ‘మీ క్లాస్‌మేట్ సక్కుబాయి అట, పెట్టి వెళ్లింది’ అన్నారు. క్లాసులో మాట్లాడకున్నా, పెళ్లికి ఆహ్వానించక పోయినా ఒక లడ్డు మాకిచ్చి సక్కుబాయి తన మంచితనాన్ని చాటింది. ఇద్దరం కలిసి ఆ లడ్డు చెరిసగం తిన్నాం. మర్నాటి ఉదయం ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చిందిగాని మా గదిలో లడ్డు వుంచిన సంగతి చెప్పలేదు. మేమూ తననేమీ అడగలేదు. ఇదేకాదు, మామి డి పండు, సీతాఫలం, అరటిపండు .. ఏదైనా ఇద్దరం చెరి సగం తినేవాళ్లం. క్లాసులోనూ పక్కపక్కనే కూర్చునే వాళ్లం. చివరకు మా ఇద్దరినీ చూసి ఈర్ష్యపడ్డ మిత్రు లూ ఉన్నారు. ఉపాధ్యాయులు మాత్రం మమ్మల్ని చూసి సంతోషించే వారు. కానీ, కొన్నాళ్లలోనే మా స్నేహాన్ని తట్టుకోలేక కాలానికి కన్ను కుట్టింది. జరగకూడని సంఘటన జరిగింది. అదికూడా ఊహింపశక్యం కాని రీతిలో.. ఒక్క పైస కోసం! 

డబ్బు విలువ ఏ కాలానికి ఆ తీరున వుంటుంది. మేం చదువుకున్న కాలం కష్టమైందే. ఇంటినుంచి ఎంత డబ్బంటే అంత డబ్బు పంపించే వాళ్లు కారు. రూపా యో, రెండు రూపాయలో ఇస్తే వాటితోనే అన్ని అవసరాలు తీర్చుకునే వాణ్ణి. టెక్ట్స్‌బుక్స్ మాత్రం తప్ప నిసరి గా కొనుక్కోవాల్సిందే. ఈనాటి పిల్లలు మోసినట్లు ఆ రోజుల్లో పుస్తకాలను బ్యాగులో నింపుకొని, వీపు వంగే లా మోసుకొని వెళ్లేవాళ్లం కాదు. నోట్ బుక్స్ తక్కువగానే ఉపయోగించే వాళ్లం. ఒక్కో టెక్ట్స్ బుక్‌కు ఒక్కో నోటు బుక్కు ఉండేది. కాగితాలను చింపడం, చిత్తు కాగితాలుగా మార్చడం వంటివి చేసేవాళ్లం కాదు. నోట్ బుక్ కొత్తది కొనగానే దానిమీద మా పేర్లు రాయడానికి ముందే ‘శ్రీరాములు నీవే కలవు’ అని తప్పక రాసుకునే వాళ్లం. 

అర్ధ పైస కోసం..

మా స్నేహితుల మధ్య దారుణమైన విభజన రేఖ పుట్టడానికి దారితీసే చెడ్డ రోజు రానే వచ్చింది. అంతకు ముందు ఒకనాడు, మా సైన్స్ టీచర్ విద్యార్థులందరినీ కొత్తగా నోట్ బుక్స్ తెచ్చుకొమ్మని ఆజ్ఞాపించారు. నేను, శాంతిరెడ్డి ఇద్దరం నోటు బుక్స్ కొనవలసిన పరిస్థితి. క్లాసులో ఉండగానే శాంతిరెడ్డి “నాదికూడా నువ్వే కొను, తర్వాత డబ్బులిస్తాను” అన్నాడు. నేను “సరే” అన్నాను. సాయంత్రం స్కూల్ ముగిశాక అతడు అద్దె గదికి వెళితే, నేను నోట్ బుక్స్ కొనడానికి షాపుకు వెళ్లాను. “రెండు నోట్ బుక్స్‌కు బారాణా అవుతుంది” అని షాపు యజమాని చెప్తే, నేను అట్లే ‘బారాణా’ ఇచ్చి తీసుకొన్నాను. ఒక ఆటాణా, ఒక చారాణా కలిపితే బారాణా. అంటే మూడు చారాణాలు. డెబ్బయి అయి దు పైసలు.

గదికి వచ్చిన తర్వాత అతనికి ఒక నోట్ బుక్ ఇచ్చి “సగం పైసలు (చెయ్యానా) ఇవ్వు” అన్నాను. శాంతిరెడ్డి వెంటనే జేబులోంచి డబ్బు తీసి నాకిచ్చాడు. అతడు ఇచ్చినవి ముప్పయి ఏడు పైసలు. అంటే, నా వంతుకు ముప్పయి ఎనిమిది పైసలు. అర్ధ పైస లేదుగా! అదనంగా ఒక పైస నేను భరించాల్సిన పరిస్థితి. నిజానికి పూర్తి పైసకూడా కాదు, తన అర్ధ పైసే. ఆ అర్ధ పైస కో సం కాలం నన్ను వెర్రివాణ్ణి చేసింది. చిన్నతనం, అ జ్ఞా నం ఏదైతేనేం జరక్కూడనిదే జరిగింది. “శాంతిరెడ్డీ! నేను బారాణాకు రెండు బుక్స్ కొని తెచ్చాను. నువ్వు 37 పైసలు ఇస్తే, నేను 38 భరించాలి. నువ్వే ఒక పైస నాకివ్వు” అన్నాను. చాలా చిత్రంగా అతనూ ఆ సమయంలో నా మనస్తత్వంతోనే ఉన్నాడు. ‘నేనెందుకు 38 పైసలు ఇస్తాను!’ అని అనుకున్నాడేమో. “ఇవ్వను” అని ఖరాకండిగా చెప్పిండు.

నిజానికి మేం విడివిడిగా షాపు కు వెళ్లి కొనుక్కుంటే తలా 38 పైసలు వెచ్చించాలి. కానీ, రెండూ కలిపి కొన్నాను కాబట్టి, మొత్తం మీద (76 పైసలకు బదులు 75 పైసలైంది) రూపాయి తక్కువకు ఇచ్చాడు. ఇద్దరి పొత్తుల ఒక పైస మిగిలింది. కానీ, అర్ధ పైసలను మేమెలా పంచుకోగలం? అది జరక్కపోగా, మా మధ్య పెద్ద ‘యుద్ధమే’ జరిగింది. కాలం ఎం త చెడ్డదైతే అంత పని చేస్తుంది! మంచి మిత్రులను అలా విడదీస్తుంది?. ఎంతో స్నేహంగా ఉన్న మాకు ఆ ఒక్క పైస విషయంలో గొడవ జరిగింది. ఆ ఒక్క పైస ఎవరు భరిం చినా సరిపోయేది, గొడవేమీ ఉండేది కాదు. శాంతిరెడ్డి ఆ ఒక్క పైస ఇవ్వలేదు కాని ఆ విషయంలో నాతో మాట్లాడటమే ఆపేశాడు. నేను కూడా మాట్లాడడం బంద్ చేశాను. ఆ ఒక్క పైస నన్ను వేరే అద్దెగదికి మార్చింది. మేం తొమ్మిదవ తరగతి ఐపో యిందాకా మాట్లాడుకోలేదు. చివరికి పదవ తరగతిలో ఏదో ఒక సందర్భంలో పరస్పరం మాట్లాడుకొన్నాం. అదికూడా కొద్ది కొద్దిగానే. ఆ తర్వాత ఎవరి దారి వారిది. మా స్నే హం అక్కడితోనే ముగిసింది. ‘డబ్బు కారణంగా స్నేహం వదులుకోవద్దనే’ జ్ఞానం మాకప్పు డు కలుగలేదు. పైసల విలువ కంటే స్నేహం విలువ చాలా గొప్పదని తర్వాత తెలిస్తే మాత్రం ఏం లాభం?!

 వ్యాసకర్త సెల్: 9885654381