- దివ్యమంజన్ పళ్లపొడిలో మాంసాహార ఉత్పత్తులు
- బ్రాండింగ్‌లో మాత్రం శాకాహార చిహ్నం
న్యూఢిల్లీ, ఆగస్టు 31: యోగా గురు బాబా రాందేవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పతంజలికి చెందిన పళ్ల పొడి ఉత్పత్తి దివ్యమంజన్‌ను శాకాహారంగా పేర్కొన్నా అందులో మాంసాహార ఉత్పత్తులు ఉన్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాకాహారం, మొక్కల ఆధారిత ఆయుర్వేద ఉత్పత్తిగా ప్రచారం చేయటం వల్ల దివ్యమంజన్‌ను చాలా కాలంగా ఉపయోగించానని, కానీ అందులో చేపల సారం నుంచి తీసిన సముద్రాఫెన్ ఉందని ఇటీవలి పరిశోధన వెల్లడించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
న్యాయవాది యతిన్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. దివ్యమంజన్ ప్యాకేజింగ్‌పై శాకాహార ఉత్పత్తులకు సూచించే ఆకుపచ్చ చిహ్నం ఉందని, అయితే పళ్లపొడిపో మాత్రం సముద్రాఫెన్ ఉన్నట్లు అందులోని పదార్థాల జాబితా చూపిస్తోందని వెల్లడించారు. ఇది పూర్తిగా మిస్ బ్రాండింగ్ అని, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. మాంసాహార పదార్థాల వినియోగాన్ని మత విశ్వాసాలు నిషేధిస్తున్నందున ఈ ఉత్పత్తి తనకు, తన కుటుంబానికి చాలా బాధ కలిగించిందని శర్మ పేర్కొన్నారు.
దీనిపై వివిధ శాఖలకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పతంజలి, బాబా రాందేవ్, కేంద్రం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది.