21-02-2025 12:00:00 AM
నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ- డ్రామా ‘బాపు’. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాజు, సీహెచ్ భానుప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
‘డైరెక్టర్ దయ రెండేళ్ల క్రితం కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా ఉంది. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఒరిజినల్‌గా కనిపించే అవకాశం ఇచ్చే స్క్రిప్ట్. అయితే దీనికి బడ్జెట్ లేదు. ఎలా చేద్దామని అనే చర్చ జరుగుతున్నప్పుడు నాకు రెమ్యునరేషన్ వద్దు.. లాభాలు వస్తే కొంత మనీ ఇమ్మని చెప్పి ప్రారంభించాం. తర్వాత అందరూ రెమ్యునరేషన్ తగ్గించి చేయడం, లొకేషన్‌లో కార్వాన్ లేకుండా అదే ఊర్లో ఉంటూ అక్కడే సర్దుకుపోయాం.
కథపై ఇష్టం, నమ్మకంతోనే అది సాధ్యపడింది. -చాలా యూనిక్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అలా నా పాత్ర ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ఏమవుతుందనేది తెరపైనే చూడాలి. ఆమని చాలా మంచి సినిమాలు చేసిన నేచురల్ ఆర్టిస్ట్. ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఇందులో ఆమె పాత్ర బలంగా ఉంటుంది.
ఇప్పుడు చిన్న సినిమాలకు ఓటీటీ అవ్వడం లేదు. అది మా అదృష్టం. ఈ సినిమాను హాట్‌స్టార్ వాళ్లు తీసుకున్నారు. బలగం సుధాకర్‌రెడ్డిది టైటిల్ రోల్. కథలో ఆయనే ముఖ్యం. ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. మంచి సినిమా చేయాలనేది మా ప్రయత్నం. అవార్డ్స్ వస్తే హ్యాపీ. -దయ చాలా మొండి డైరెక్టర్. విన్నట్లు నటిస్తాడు కానీ వినడు.. ఆయనకు అనిపించింది చేస్తాడు (నవ్వుతూ). తనలో చాలా క్లారిటీ ఉంది. డైరెక్షన్ మీద పట్టుంది.
చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. -ఇప్పటివరకూ సినిమా చూసి ప్రతిఒక్కరూ చాలా బావుందని ఫోన్లు చేస్తున్నారు. జనరల్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటికి సినిమా చూపించాను.. ఆయనకు చాలా నచ్చింది. ఈ సినిమాను చాలా మంది బలగంతో పోల్చుతున్నారట.. -అది మంచిదే. బలగం సుధాకర్ ఉండటంతో ఆ పోలిక మరింతగా వస్తోంది. అయితే బలగం సినిమాకూ, దీనికి ఏ పోలికా లేదు.
ఆ కథ వేరు.. ఈ కథ వేరు. ‘-సూపర్ డీలక్స్’లో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర వస్తే చేయాలని ఉంది. -కథ, నా పాత్ర బాగున్న కథల్నే ఎంపిక చేసుకుంటా. ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలన్న ప్రయత్నంతో చేసిన సినిమానే ‘బాపు’. నాకు భావోద్వేగపూరితమైన పాత్రలంటే చాలా ఇష్టం. నేను ఇంకా చిరంజీవి ‘విశ్వంభర’లో ఓ క్యారెక్టర్ చేశా. తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నా. రాజ్‌తరుణ్‌తో ఓ సినిమా, సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’లో ఓ క్యారెక్టర్ చేశా.