calender_icon.png 30 April, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటెక్ చదివి గంజాయి దందా

30-04-2025 12:00:00 AM

డ్రగ్స్‌కు అలవాటు పడి సరఫరాదారులుగా మారి

నలురిని అరెస్టు చేసిన పోలీసులు

రూ.1.40 కోట్ల గంజాయి పట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): బీటెక్ పూర్తి చేసి, వివిధ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా.. డ్రగ్స్‌కు అలవాటుపడటంతో గంజాయి దందాకు తెరలేపారు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.1.40 కోట్ల ఓజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగర క్రైమ్ అడిషనల్ సీపీ పీ విశ్వప్రసాద్ మంగళవారం వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్‌న్యూ, నల్లకుంట పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జబల్‌పూర్(మధ్యప్రదేశ్)కు చెందిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారులు హర్షవర్ధన్ శ్రీవాస్తవ, బి.శ్రీనివాసరాహుల్‌లతో పాటు స్థానిక విక్రేతలు అభిషేక్, ధావల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ.1.40 కోట్ల విలువైన ఓజీ గంజాయి, రూ.10వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు, ప్యాకింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హర్షవర్ధన్ శ్రీవాస్తవకు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించారు. రహస్యంగా ఆన్‌లైన్‌లో డ్రెడ్ మార్కెట్, సిగ్నల్ యాప్ వంటి వాటిని వినియోగించి గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు, డీటీడీసీ,  శ్రీతిరుపతి, శ్రీఆంజనేయులు అనే పేరిట కొరియర్ ద్వారా అముమ్మతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

క్రిప్టోకరెన్సీ, హవాలా రూపంలో డబ్బును స్వీకరిస్తున్నాడు. కాగా చెన్నైకి చెందిన శ్రీనివాస రాహుల్ అనే వ్యక్తి స్నాప్‌చాట్ ద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో అమ్ముతున్నాడు. అభిషేక్ అనే వ్యక్తి మ్యాజిక్ మష్రూమ్‌లను సిగ్నల్ యాప్ ద్వారా వినియోగదారులకు చేరవేస్తున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన దవల్ అనే వ్యక్తి అభిషేక్ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ను కొని అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులందరూ మధ్యతరగతికి చెందిన వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులు వారికి అన్ని వసతులు కల్పించినప్పటికీ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారు వ్యసనపరులుగా మారి, చివరికి డ్రగ్స్ విక్రేతలుగా మారినట్లు పోలీసులు నిర్ధారించారు.

డ్రగ్స్ సరఫరాదారులుగా ఉన్న హర్షవర్ధన్ శ్రీవాస్తవ పూణెలోని ఆయోజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, డిజైన్ అనే విద్యాసంస్థలో బీఆర్క్ చేశాడు. శ్రీనివాస రాహుల్ చెన్నైలోని రాజాలక్ష్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్‌చేసి, ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. అభిషేక్ అనే వ్కక్తి ఐఐఐటీ రాయ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ధావల్ చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. వీరికి నగరంలోని పలువురు డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు, ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులతో సంబంధాలున్నాయని, వారికి మత్తు పదార్థాలు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.