calender_icon.png 24 October, 2024 | 11:45 AM

సరికొత్త హంగులతో అజ్రఖ్ ప్రింట్!

05-09-2024 12:00:00 AM

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్టుగా పాతవే కొత్త హంగులద్దుకొని ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి. వాటిలో ‘అజ్రఖ్’ ప్రింట్ ఒకటి. క్రీస్తు పూ ర్వం 3000 ఏళ్ల నాడు సింధులో య నాగరికత బయటపడిన సమయంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు లో ఉన్న సింధ్ ప్రావిన్స్‌లో తొలిసారి ఈ ప్రింట్‌కు సంబంధిం చిన ఆనవాళ్లను గుర్తించారు. భారత్‌కు వలస వచ్చిన కళాకారులు ఈ ఫ్యాషన్ కళ ఆనవాళ్లను తమ వెంటపెట్టుకొని గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో ఇక్కడే ఈ కళ మొగ్గ తొడిగింది. నాటి నుంచి నేటి వరకు మన దేశ ప్రాచీన కళల్లో ఒకటిగా వర్ధిల్లుతున్నది. తాజాగా దీనికి భౌగోళిక గుర్తింపు (GI tag) కూడా అందింది. దీనికి ‘కచ్ అజ్రఖ్’ గానూ పేరుంది.

అజ్రఖ్ అంటే అరబిక్‌లో నీలం అని అర్థం. దీనిలో ఎక్కువగా నీలి రంగే హైలెట్ అవుతుంది. ఈ ప్రింట్ కోసం ముందుగా చెక్కతో చేసిన బ్లాక్స్ పై.. మోటిఫ్స్, ఫ్లోరల్ మోటిఫ్స్, జామోట్రిక్ ప్యాటర్న్స్, భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా విభిన్న డిజైన్లను చెక్కుతారు. ఈ బ్లాక్స్‌ని ఆయా రంగుల్లో ముంచుతూ దుస్తులపై ముద్రిస్తారు. ఇలా 12-14 దశల్లో వీటిని తయారు చేస్తారు. వీటిలో వాడే రంగులు కూడా సహజ సిద్ధంగా తయారు చేస్తారు. అజ్రఖ్ ప్రింటెడ్ ఫ్యాషన్‌లో ప్రస్తుతం చీరలే కాదు.. విభిన్న ఫ్యాషనబుల్ దుస్తులూ రూపుదిద్దుకుంటున్నాయి.

పలాజో, క్రాప్‌టాప్ సెట్, కుర్తా సెట్స్, మోడ్రన్ బ్లౌజులు ఎన్నో వస్తున్నాయి. ఈ అజ్రఖ్ ప్రింట్స్‌తో ప్రస్తుతం చాలా రకాల దుస్తులు ఫ్లోరల్ మోటిఫ్స్, జామోట్రిక్ ప్రింట్స్‌తో సమకాలీన హంగులద్దుకుంటున్నాయి. ఎంచుకున్న అజ్రఖ్ ఫ్యాషన్‌పై ముదురు రంగుల్లో రూపొందించిన జాకెట్, షాల్, కార్డిగాన్.. వంటివి జత చేస్తే లుక్ మరింత ఇనుమడిస్తుంది. ఇక వీటికి జతగా ధరించే యాక్సెసరీస్‌ని కూడా మోడ్రన్‌గా ఎంచుకున్నప్పుడు మరింత అందంగా మెరిసిపోవచ్చు. తక్కువ మేకప్, సిల్వర్ లేదా యాంటిక్ జువెలరీని అజ్రఖ్ ప్రింటెడ్ దుస్తులకు జత చేస్తే.. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు.