calender_icon.png 25 March, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గనుల్లో ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలి

23-03-2025 05:55:34 PM

సీఐటీయూ నాయకులు..

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఇటీవల కాలంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రమాదాల నివారణకు కార్మికులకు యాజమాన్యం గని రక్షణ కమిటీలు అవగాహన కల్పించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. రామకృష్ణాపూర్ లోని  యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏరియా పరిదిలో ఇటీవల కాలంలో తరచుగా గనులలో ప్రమాదాలు జరుగుతున్నా యని, కొన్నింటికి రిపోర్టులు రాయకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

గెలిచిన సంఘాలు తమ వంతు బాధ్యతగా కార్మికులకు అండగా ఉండకపోగా యాజమాన్యానికి అనుకూలంగా మారి కార్మికులకు నష్టం జరిపే ప్రయత్నాలు చేస్తున్నారని దీనిని వెంటనే మానుకోవాలని సూచించారు. యాజమాన్యం తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా అనుకూలంగా లేకపోతే మరోలా ప్రవర్తించడం మానుకొని కార్మికుల పక్షాన యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ముందుకుపోవాలని వారు హితవు పలికారు. గత మూడు నెలలుగా ఏరియాలో స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించినప్పటికీ పలు సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని వాటిపై ఒత్తిడి తీసుకువచ్చి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎండలు ముదురుతున్నా సమయ వేళల మార్పుపై, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడంపై గుర్తింపు సంఘం స్పందించక పోవడం సరికాదని వెంటనే పనివేళల మార్పుకు కృషి చేయాలన్నారు.

నాయకులు గాలికి తిరగకుండా గనులలోకి దిగి వారి పని వారు చేసినప్పుడే కార్మికులపై పని ఒత్తిడి ఎలా ఉందని తెలుస్తుందని వారు ఆన్నారు. ఇటీవల సిఐటియు ఆద్వర్యంలో కార్మికుల సమస్యలపై పెంచుతున్న అవగాహన గమనించి పెద్ద ఎత్తున యువ కార్మికులు యూనియన్ లో చేరుతూ యూనియన్ను బలోపేతం చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా పలువురు యూనియన్ లో చేరగా వారికి బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ డి.సురేష్, లింగాల రమేష్, ఆయిందాల శ్రీనివాస్, ఆదర్శ్, పి.నాగరాజు, ఆమిన్, మహేందర్, నాగవెల్లి శ్రీధర్, సత్యనారాయణ, పంగ మల్లేష్, సీనియర్ నాయకులు అలవల.సంజీవ్ లు పాల్గొన్నారు.