16-04-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ తన ఛాంబర్ లో కలెక్టరేట్ సూపరింటెండెంట్ లతో భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన కల్పించడం పై సమీక్ష నిర్వహించారు.
భూ భారతి చట్టం- 2025 పై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఏప్రిల్, 17 నుండి మండలాల వారీగా రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం పై అవగాహన, అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి చట్టం- 2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
అయితే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే ముందు సంబంధిత భూమి సర్వే చేసే మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది. తహసిల్దార్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేస్తారని తద్వారా నెలల తరబడి మ్యుటేషన్ కొరకు తిరగటం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం ఉండదన్నారు.
రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం భూ భారతి చట్టంలో కల్పించడం జరిగిందన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.