calender_icon.png 24 October, 2024 | 11:04 PM

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి

12-07-2024 12:09:28 AM

కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గన్యా, డయేరియా, విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో జపనీస్ ఎన్సెఫలిటీస్(జేఈ) వ్యాక్సిన్‌పై డీఈవో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వక్ఫ్‌బోర్డ్ అధికారులతో పాటు వివిధ శాఖలతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదడు వాపు వ్యాధి నివారణ కోసం జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మదర్సాల్లో జేఈ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రతీ ఇంట్లో శుక్రవారం డ్రైడేను పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లోని పూల కుండీలు, ఫ్రిజ్, టైర్లు, కొబ్బరి బోండాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. డయేరియా రాకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్‌కు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ తెలిపారు. ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి ఓఆర్‌ఎస్, జింక్ ప్యాకెట్లను అందిస్తామన్నారు. పిల్లలకు వారి తల్లిదండ్రులకు జేఈ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తామని డీఈవో ఆర్ రోహిణి చెప్పారు. వ్యాధిపై అవగాహన కల్పిస్తూ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. 

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తిచేయాలి.. 

జిల్లావ్యాప్తంగా 384 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గతంలో పాఠశాలలోని పరిస్థితులు, పనులు పూర్తయ్యాక పరిస్థితులపై డాక్యుమెంటేషన్ రూపొందిం చాలని సూచించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసిందని, గృహిణులు, విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకళ, ఎస్సీ, బీసీ, మైనార్టీ శాఖ జిల్లా సంక్షేమ అధికారులు యాదయ్య, ఆశన్న, ఇలియాస్ అహ్మద్, టీజీఈడబ్ల్యూఐడీ ఈఈ షఫీమియా, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ చలపతిరావు, జిల్లా సైన్స్ అధికారి ధర్మేంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.