- నగరాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి
- హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవాలపై జీహెచ్‌ఎంపీ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేశ్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రైసింగ్ హైదరాబాద్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రూ. 2 వేల కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేయడంతో ప్రజల్లో వాటిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7,8,9 వ తేదీల్లో హైదరాబాద్‌లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నందున 7వ తేదీన డివిజన్లలో, 8న నియోజకవర్గాల వారీగా మహిళలు, లబ్ధిదారులతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 9న సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ట్యాంక్‌బండ్‌పై దాదాపు లక్ష మందితో విజయోత్సవాలు నిర్వహిస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్ నుండి భారీగా జన సమీకరణ చేయాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు ఫహీం, నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయికుమార్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, సమీర్ ఉల్లాఖాన్, నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.