26-02-2025 01:55:31 AM
ఐఐఎంసీ కాలేజీలో నిర్వహణ
ఖైరతాబాద్, ఫిబ్రవరి 25: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైసెస్ సంయుక్తంగా మంగళవారం లక్డికపుల్‌లోని ఐఐఎంసీ కళాశాల ప్రాంగణంలో ‘ప్రాజెక్ట్ వర్క్ పై అవగాహన సదస్సు (డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు)ను ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. నరేష్‌రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు.
ప్రతి విద్యార్థి సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అదేవిధంగా కళాశాలలు కూడా జాతీయ విద్యా విధానం 2020 సూచించిన విధంగా సమాజ అవసరాలకు ఉపయోగపడే వివిధ రకాల సాంకేతిక కోర్సులను అందించాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీస్తున్న ఐఐఎంసీ, ఐపీఈ కాలేజీలను అభినందించారు.
ఐపీఈ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ఐపీఈ, ఐఐఎంసీ కళాశాలలు సంయుక్తంగా గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులలో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు వర్క్ గైడెన్స్ పైన సదస్సును నిర్వహిస్తున్నాయన్నారు.
సదస్సు కోఆర్డినేటర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులలో పరిశోధన పై అవగాహన కలిగించి ఉత్తమ పరిశోధనలు చేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ అతిథులతో కలిసి పరిశోధనా విధానంతో కూడిన ‘ప్రాజెక్ట్ వర్క్ గైడెన్స్‘ అనే పాకెట్ డైరీని ఆవిష్కరించారు.
సదస్సులో ఓయూ ప్రొ.పాట్రిక్, ప్రొ.రంజిని, ప్రొ.నరేంద్రనాథ్, ప్రొ.సత్యనారాయణ, ప్రొ.కళ్యాణి, డా.స్వాతి, ఐపీఈ ప్రొ. అనంతకుమార్, ప్రొ.రామకృష్ణ, ప్రొ.చంద్రశేఖర్, ప్రొ.సింజు శంకర్ పాల్గొన్నారు. జంట నగరాలకు చెందిన 50 కళాశాలల నుంచి 800 పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఐఐఎంసీ, ఐపీఈ వారి ఉచిత కిట్, ఉచిత పాకెట్ ప్రాజెక్టు వర్క్ గైడ్, ప్రశంసా పత్రం అందజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ డా. తిరుమలరావు, డా.సంతోషి పాల్గొన్నారు.