calender_icon.png 25 November, 2024 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూటి ఎరువులు వరిగడ్డి, పత్తి కట్టపై అవగాహన సదస్సు

25-11-2024 04:50:39 PM

వరిగడ్డి పత్తి కట్టెను భూమిలో కలియ దున్నడం వలన భూసారవంతం పెరుగుతుంది

మండల వ్యవసాయ అధికారిని పద్మజ

మునుగోడు (విజయక్రాంతి): సూటి ఎరువులు వరిగడ్డి, పత్తి కట్టేను భూమిలో కలియ దున్నడం వలన భూసారవంతం పెరిగి పంటలు అధిక దిగుబడిలు వస్తాయని మండల వ్యవసాయ అధికారిని పద్మజ అన్నారు. సోమవారం మండలంలోని పులిపలుపుల క్లస్టర్ రైతు వేదికలో  డీఏపీకి బదులు ప్రత్యామ్నాయంగా సూటి ఎరువులు పి ఎస్ బి ఎరువులపై అవగాహన కల్పించి మాట్లాడారు. వరి, పత్తిపంటలో సూటి ఎరువులను వాడడం వల్ల ఖర్చు తగ్గి నేల సారం పెరుగుతుంది. వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి వాడుతారు. తగులబెట్టకుండా యూరియాతో మాగ బెట్టి, పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలని, పొలంలో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది.

నేలలో కలియదున్నినప్పుడు కర్బన/నత్రజని దీర్ఘకాలంలో నేల సేంద్రీయ కర్బనం, జింక్, కాపర్, ఇనుము, మాంగనీస్ సూక్ష్మపోషకాల లభ్యత పెరుగుతుందిని అన్నారు. పత్తి కట్టెలో 68% సెల్యులోస్, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. ఒక 1000 టన్నుల పత్తి కట్టెతో 100 కె.వి. సామర్థ్యపు 5 విద్యుత్తు కేంద్రాలను ఒక సంవత్సరం నిర్వహించడానికి సరిపోతుంది. పత్తి కట్టెను ఇటీవలె అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోషెక్టర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. పత్తి కట్టెను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన పదార్ధం పెరుగి భూభౌతిక స్థితులు మెరుగుపడి మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. తేమను నిలుపుకునే శక్తి పెరిగి వర్షాభావ పరిస్థితుల్లో సైతం పత్తి పైరు తట్టుకోగల్గుతుంది. సూక్ష్మపోషక లోపాలు తగ్గుతాయి. గులాబీ రంగు పురుగు సమర్ధవంతంగా అరికట్టబడుతుందిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. నరసింహ, రైతులు దోటి బిక్షం, జనగం నరసింహ, బొలుగురి ఎల్లయ్య, సైదులు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.