హైదరాబాద్,(విజయక్రాంతి): పాలకుర్తి నియోజకవర్గంలో భూ భారతి చట్టం, ఇతర భూ చట్టాలపై అవగాహన సదస్సును లిఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సదస్సులో పాలకుర్తి ఎమ్యెల్యే యశస్విని రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, భూ భారతి చట్టం రూపకర్త భూమి సునీల్, నియోజకవర్గ నాయకురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్యెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు భూ భారతి చట్టం ప్రాముఖ్యతను వివరించారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని, భూ హక్కుల పరిరక్షణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. రైతులు తమ భూములపై పూర్తి హక్కులను పొందేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిమాట్లాడుతూ.. రైతుల హక్కులు, భూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని గుర్తు చేశారు. రైతులు తమ భూములపై పూర్తి హక్కులను తెలుసుకోవడం ద్వారా భూ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనగలరు. భూ భారతి చట్టం రైతులకు న్యాయ పరంగా ఎంతగానో సహాయపడుతుందని వివరించారు. భూ భారతి చట్టం రూపకర్త భూమి సునీల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ముఖ్యాంశాలను వివరించారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ, భూ హక్కుల పరిరక్షణ, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలు ఎలా సులభతరం అవుతాయో వెల్లడించారు. రైతులు ఈ చట్టం ద్వారా ప్రభుత్వ అందించే ప్రయోజనాలను ఎలా పొందాలో వివరించారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. భూ సంస్కరణలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైతుల హక్కులను పరిరక్షించడానికి భూ చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. భూ భారతి చట్టం ఈ మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పాలకుర్తి నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి వివరించారు. భూ భారతి చట్టం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు తమ భూములపై పూర్తి హక్కులను పొందేందుకు ఈ చట్టం ఎంతగానో సహాయపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ కుమార్ సింగ్, ఆర్డీవోలు, ఎమార్వోలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, రైతు సోదరులు, యువ నాయకులు, యువ రైతులు, మహిళ రైతులు, తదితరులు, పాల్గొన్నారు.