04-04-2025 10:40:50 PM
నిషేధిత పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన ర్యాలీ
మందమర్రి,(విజయక్రాంతి): పత్తి రైతులు నిషేధిత గ్లైసిల్ పత్తి విత్తనాలకు దూరంగా ఉండి ప్రభుత్వ అధికృత ఎరువుల డీలర్ల నుండి నాణ్యమైన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పత్తి సాగు చేయాలని మండల వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు కోరారు. గ్లైసిల్ పత్తి విత్తనాలు, గ్లైపోనేట్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిదిలో రైతులకు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయ, పోలీస్ అధికారులు మాట్లాడారు. నిషేధిత గ్లైసిల్ పత్తి విత్తనాల మూలంగా పంటలకు గ్లైపోనేట్ గడ్డి మందు పిచికారి చేయడంతో చెట్లు ఆకులనే కాకుండా భూగర్భంలోని వేర్లను నిర్వీర్యం చేస్తుందని ఆన్నారు. గడ్డి మందులు పిచికారి మూలంగా భూమి లోపల గ్లైపోసిట్ విషాన్ని నింపుతున్నామని తద్వారా భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయని అంతే కాకుండా పదిహేను సంవత్సరాల అనంతరం భూగర్భం విషపూరితంగా మారి అ నేలా ఎలాంటి పంటలు పండకుండా సాగుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిషేధిత గ్లైసిల్ విత్తనాల మూలంగా పంట దిగుబడి తగ్గడమే కాకుండా వాటి దుష్పరిణామాలు మానవాళి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు నిషేధిత పత్తి విత్తనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కౌలు రైతులు పెట్టుబడి తగ్గుతుందనే ఆలోచనతో నిషేధిత పత్తి విత్తనాల పట్ల మొగ్గు చూపుతున్నారని దీనిని వెంటనే మానుకోవాలని వారు సూచించారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వ అధికృత లైసెన్స్ కలిగి ఉన్న ఎరువుల నుండి దాన్యమైన పతి గింజలను కొనుగోలు చేసి సాగు చేయాలని కోరారు.అనంతరం గ్రామ రైతులతో నకిలీ పత్తి విత్తనాలకు దూరంగా ఉండి నాణ్యమైన పత్తి విత్తనాలను సాగు చేస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కిరణ్మయి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఎంపీడీవో రాజేశ్వర్, వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు, గ్రామ రైతులు పాల్గొన్నారు.