24-03-2025 05:16:45 PM
సింగరేణి వైద్యాధికారి లోకనాథ్ రెడ్డి..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు వేసవిలో వడదెబ్బకు గురికావద్దని ముఖ్యంగా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని సింగరేణి వైద్యాధికారి లోకనాథరెడ్డి అన్నారు. ఏరియాలోని కెకె ఓసిపిలో వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ఎండలో ఎక్కువసేపు తిరిగ వద్దన్నారు. నీరు ఎక్కువ తీసుకోవాలని శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, నిమ్మరసం, పండ్ల రసాలు తాగాలని, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలన్నారు. వేపుడు పదార్థాలు తినవద్దని మద్యపానం మాంసం తగ్గించాలని ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, బిపీ ఉన్నవారు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, కెకె ఓసిపి మేనేజర్ రామరాజు, ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి రాజేష్ కుమార్ యాదవ్, సంక్షేమ అధికారి సందీప్, అధికారులు కెకె.ఓసి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.