మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో క్షయ నివారణ, కుష్టు నివారణ, మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, క్రిమి కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, రక్తహీనత, హెచ్ఐవి, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, వ్యాధులు ప్రబలకుండా తీసుకోచాల్సిన జాగ్రత్తల చర్యల పట్ల కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశానుసారం గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో కళాజాత కార్యక్రమాలు చేపట్టడం జరిగినట్లు తెలిపారు. జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అంబటి పల్లి, ఆజాంనగర్, మహాముత్తారంలలోని 30 గ్రామ పంచాయతీలలో కళా జాత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కళజాత కార్యక్రమాలు జనవరి 18 నుండి 30 వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందన్నారు.