హైదరాబాద్,(విజయక్రాంతి): కులగణనపై గాంధీభవన్ లో అవగాహన సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా మాటిచ్చారని గుర్తు చేశారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సోనియా గాంధీ ప్రజాలకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని సీఎం పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని చెప్పారు.
నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి యుద్ధానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ నుంచే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు. కులగణన ఎక్సరే మాత్రమే కాదు. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తిచేసి 10 నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రూప్-1పై ప్రతిపక్షాలు ఎన్నో అపోహలు సృష్టించాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల ఘనన పై ఎలాంటి అనుమానాలు ఉన్న గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.