22-03-2025 09:45:23 PM
పటాన్ చెరు: ఐడీఏ బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం లైంగిక వేదింపులు, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పటాన్ చెరు డీఎస్‌పీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రం కో ఆర్డినేటర్ దైవలక్ష్మి విద్యార్థులకు లైంగిక వేదింపులు, పోక్సో చట్టం గురించి వివరించారు.
అనంతరం డీఎస్‌పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... హైస్కూల్ స్థాయి అనేది ప్రతి విద్యార్థికి కీలక దశ అని, ఇదే పునాది అని తెలిపారు. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థి స్థాయిలోనే చాలా మంది చెడు మార్గాలవైపు అడుగులేస్తున్నారని చెప్పారు. మంచేదో..చెడు ఏదో గుర్తించే విచక్షణ కోసమే ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఐడీఏలో అగ్ని ప్రమాదాలపై పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్‌పీ రవీందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మంగీలాల్, ఉపాధ్యాయులు, పరిశ్రమల ప్రతినిధులు, భరోస కేంద్రం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.