15-04-2025 10:35:13 PM
హుస్నాబాద్ బస్టాండ్‌లో అగ్నిమాపక శాఖ నీటి ప్రదర్శన..
హుస్నాబాద్: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో మంగళవారం అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బంది నీటి ప్రదర్శన నిర్వహించి, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకుముందు బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన వాల్ పోస్టర్లను కూడా అతికించారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రతిక్షణం ఎంతో విలువైనదని, వెంటనే 101కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే సమయంలో తప్పుడు వివరాలు ఇవ్వకుండా, ప్రమాదంలో మండుతున్న వస్తువుల గురించి స్పష్టంగా చెప్పాలన్నారు. వివరాలు తెలిపేటప్పుడు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్ఎఫ్ వో పరమేశ్వర్, లీడింగ్ ఫైర్‌మెన్ వెంకటేశం, డ్రైవర్ ఆపరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఫైర్‌మెన్ రామన్ కుమార్, నిఖిల్, సత్యనారాయణ, వెంకటేశ్, కమలాకర్ పాల్గొన్నారు.