* పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులు
* జిల్లా కలెక్టర్లతో వీసీలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై గ్రామీణ ప్రాంత ప్రజలకూ అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్లకు ఆదేశించారు. రోడ్డు భద్రతపై శనివారం మంత్రి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు.
రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని, దానిని పూర్తిగా తగ్గించడానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. ౮౦ శాతం రోడ్డు ప్రమాదాలు అధిక వేగం, మద్యం తాగి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, విశ్రాంతి లేని డ్రైవింగ్‌తోనే జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిం చాలని చెప్పారు.
రహదారి భద్రతపై జిల్లాస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో అవగాహన సదస్సులు, సెమినార్లు , వర్క్ షాపులు నిర్వహించాలని, పాఠశాలలు, కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలు, వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నిబంధనలు పాటించని వారికి భారీగా జరిమానా లు విధించాలని ఆదేశించారు. రవాణా, ఆర్‌అండ్‌బి, పోలీస్, పాఠశాల విద్యా శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ శాఖలతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రముఖ వ్యక్తులను రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.