18-03-2025 12:00:00 AM
వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపు
జనగామ, మార్చి 17(విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డులు, రివార్డులు ఉంటాయని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం ఆయన కలెక్టరెట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలని పిల్లలకు సూచించారు. ఎలాంటి భయం, ఆందోళనకు గురి కావద్దని, కూల్ మైండ్‌తో పరీక్షలు రాయాలని చెప్పారు.
పరీక్షలకు ప్రతి విద్యార్థి హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూపాలన్నారు. తగినంత వ్యాయామం, మంచి పోషకాహారం, తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. పరీక్షలకు వారం ముందు నుంచి కేవలం చదివినవి పునరుశ్చరణ మాత్రమే చేసుకోవాలన్నారు.
జిల్లా టాపర్‌కు సైకిల్ గిఫ్ట్
పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి బహుమతులు ఉంటాయని కలెక్టర్ చెప్పారు. వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు కూడా ప్రత్యేక అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు. జిల్లా టాపర్‌కు సైకిల్ బహుమానంగా ఇస్తామని స్పష్టం చేశారు. మండల టాపర్లకు ప్రత్యేక రివార్డులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలె క్టర్ పింకేష్ కుమార్, డీఈఓ రమేశ్, ఏసీజీ రవికుమార్, జీసీడీవో గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.