calender_icon.png 22 September, 2024 | 4:13 AM

సిద్దిపేట ఏసీపీని తప్పించండి

26-07-2024 01:11:01 AM

  • కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్

సిద్దిపేట, జూలై 25(విజయక్రాంతి): సిద్దిపేట ఏసీపీ, సిద్దిపేట రూరల్ సీఐ ఆఫీసులకు సీసీ కెమెరాలు ఏర్పాటు దశలో ఉన్నాయంటూ తప్పుడు సమాచారం ఇచ్చిన ఏసీపీ మధును ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ నాయకుడు, ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చక్రధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన అంతగిరి చంద్రశేఖర్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టి, కన్నతల్లిని హత్య చేసినట్లు ఒప్పించి జైలుకు పంపించారని ఆరోపించారు.

ఈ క్రమంలో సిద్దిపేట ఏసీపీ ఆఫీసు, సిద్దిపేట వన్‌టౌన్, సిద్దిపేట రూరల్ సీఐ ఆఫీసులకు వెయ్యి మీటర్ల దూరం వరకు గల సీసీ ఫుటేజీ ఇవ్వాలని నెల రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆయా ఆఫీసుల వద్ద సీసీ కెమెరాలు ఇంకా ఏర్పాటు దశలో ఉన్నాయని, వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీ ఫుటేజీల రికార్డును తీయటం సాధ్యంకాదని, అంతర్గత భద్రతకు సంబంధించినవి కాబట్టి పోలీసు స్టేషన్‌కు చెందిన సీసీ ఫుటేజీలు కాబట్టి ఇవ్వడం సాధ్యంకాదని ఏసీపీ సమాధానం ఇచ్చినట్లు చక్రధర్ వెల్లడించారు. సమాచారం అడిగిన తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.