calender_icon.png 9 January, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలను నివారించండి

06-01-2025 06:45:32 PM

ధ్రువ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి 

లారీ యజమానులకు డ్రైవర్లకు అవగాహన 

కరీంనగర్ డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి 

మానకొండూరు (విజయక్రాంతి): నిత్యం రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒకరిలో చైతన్యం వచ్చినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని కరీంనగర్ ఉప రవాణా శాఖ డి.టి.ఓ శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. కరీంనగర్ ఉప రవాణా శాఖ (డిటిసి) డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పెద్దింటి పురుషోత్తం ఆదేశానుసారం కరీంనగర్ లోని బొమ్మకల్ లో గల లారీ అసోసియేషన్ లో లారీ యజమానులకు, డ్రైవర్ల కు రోడ్డు భద్రత మాసోత్సవాలపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ.. యజమానులకు, డ్రైవర్లకు రోడ్డుపై లారీలు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో డ్రైవ్ చేయాలని పలు సూచనలు చేశారు. భారీ వాహనాల లారీల వలన ప్రమాదం జరిగితే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని లారీ డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు.

అధిక లోడ్ తో వాహనాలు డ్రైవ్ చేసినప్పుడు మధ్యం, ధూమపానం, సేవించి, మొబైల్ లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయరాదన్నారు. లారీలకు వెనుక, ముందు, పక్కలకు రేడియం స్టికర్స్ అంటిచుకోవలని, వాటిని తరచుగా శుభ్రపరచుకోవలని సూచించారు. వాహనాలను రహదారుల పక్కన నిలపడం వలన ప్రమాదాలు అధికంగా జరుగుతుండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ లారీలను నిలుపకూడదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలని లైసెన్సు లేని వారికి వాహనం ఇచ్చినట్లయితే యజమానిపై కేసు నమోదు అవుతుందన్నారు. మద్యం, ధూమపానంలతో పాటు ఇతర మత్తు పదార్థాలకు బానిసై డ్రైవింగ్ చేస్తే తమ తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. లారీ డ్రైవర్లు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకొని రోడ్డు నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించేందుకు తమవంతు కృషి చేయాలని అన్నారు.

వాహన పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలి 

లారీ ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సరియైన సమయానికి క్రమబద్దీకరించుకోవలని సూచించారు. లారీ ఇన్సూరెన్స్ పత్రాలు ఆన్లైన్లో తీసుకోవాలని అంతేకానీ మధ్యవర్తులను ఎవరిని ఆశ్రయించకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని స్పష్టం చేశారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడపకూడదని తెలిపారు. ఫిట్ నెస్ లేకుండా వాహనాలు నడిపినట్లయితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐ, లు స్రవంతి, హరితలతో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.