కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్‌స్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు
కరీంనగర్, అక్టోబరు 28 (విజయక్రాంతి): జన్వాడ ఫామ్‌హౌజ్‌లో జరిగిన కుటుంబ పార్టీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేవ్ పార్టీ అని పేర్కొనడం సరికాదని, ఆయన కేవలం కుటిల రాజకీయాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు జీవీ రామకృష్నారావు అన్నారు.
కరీంనగర్ నగరంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే కొందరు జన్వాడ కుటుంబ పార్టీని రేవ్ పార్టీగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జన్వాడలో ఏం జరిగిందో తెలియ కుండానే కేంద్ర మంత్రి బండి సంజయ్ విందులో పాల్గొన్న వారి రక్త నమూనాలు తీయాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కుటుంబ పార్టీకి హాజరైన మహిళలను కించపరడమేనా బండి సంజయ్‌కి తెలిసిన సనాతన ధర్మమని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ట్రోల్స్‌కు పాల్పాడుతున్నట్లుగానే, బండి సంజయ్ అంతకంటే దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, ముందు ఆ రాష్ట్రాల్లో డ్రగ్స్ కంట్రోల్ చేసేలా చూడాలని హితవు పలికారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్‌ఎస్‌ను అభాసుపాలు చేసే పని పెట్టుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించడంతోనే బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని అర్థమవుతుందని, నేడు కాకపోతే రేపు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కరీంనగర్ పార్లమెంట్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.