పార్టీ మారుతున్నవారికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో చేరుతున్నవారు బీఆర్‌ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని, ఇనాళ్లూ గులాబీ జెండా మోసి, కేసీఆర్‌కు జైకొట్టి ఇప్పుడు పార్టీ ఉండదన్నట్టు మాట్లాడటం మానుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని, ప్రజలు నిర్ణయించాలి తప్ప, కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన ఏమికాదని పేర్కొన్నారు.
రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ప్రస్తుతం ఏ స్థాయికి చేరిందో, కాంగ్రెస్‌కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీకి గొప్ప ఉద్యమ చరిత్ర ఉందని, త్యాగాల పునాదుల మీద బీఆర్‌ఎస్ పుట్టిందని, సమయం వచ్చినప్పుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేసి గెలిచిన సంగతి మరిచిపోవద్దని గుర్తుచేశారు. పార్టీ మారే నాయకులు తొందరపడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే కాదు ఇంకా 14 పార్టీలకు సీట్లు రాలేదని పేర్కొన్నారు. మోదీ కావాలా? వద్దా? అనే ప్రాతిపదికన పార్లమెంటు ఎన్నికలు జరిగాయన్నారు. బీఆర్‌ఎస్‌కు 65 లక్షల సభ్యత్వం ఉందని, ఆషామాషీగా తుడిచి పెట్టలేరని, తెలంగాణ ప్రజలే కాపాడుతారని పేర్కొన్నారు.
తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవా లంటే బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలని, తెలంగాణ దేశంలో అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చకపోతే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని, కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించవద్దని హితవుపలికారు. పార్టీ వీడేవారు సొంత బలం మీద గెలిచామనుకుంటే రాజీనామా చేసి మళ్లీ గెలువాలని సవాల్‌చేశారు. ఉద్యమ పార్టీపై నిందలు వేయడం సరికాదని, కేసీఆర్ తెలంగాణకు మంచి చేయడమే కాంగ్రెస్ నాయకులకు తప్పుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌ను జైలుకు పంపుతామని మాట్లాడుతున్నారని, తప్పు చేస్తే న్యాయస్థానాలు చూసుకుంటున్నాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. పార్టీలో అన్ని అనుభవించి ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని, గతంలో ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రాని పార్టీలు ఇప్పుడు అదికారంలోకి వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడున్న నాయకుంతా వెళ్లిన బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.