నా రెండేళ్ళ ప్రయాణం పవన్‌కుమార్ కొత్తూరి
‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గా ఈ సారి తెరమీదికి వస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ “రెండేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేశాను. తల్లి అంటే ఝాన్సీ, తండ్రి అంటే రాజీవ్ కనకాల గారే అనుకున్నా. ఆ పాత్రల్లో వారే నటించాడం నా అదృష్టం. కాలేజ్ కుర్రాడంటే జాలీగా ఉంటాడని అంతా అనుకుంటారు.
కానీ అదే ఛాలెంజింగ్ ఫేజ్. పిల్లలు, తల్లిదండ్రుల పడే ఆవేదన వంటివి ఈ సినిమాలో చూపించాను. కాలేజ్ అంటే రకరకాల క్యారెక్టర్లు కనిపిస్తాయి. నాని పాత్రలో నిజాయితీ ఉంటుంది” అని అన్నారు. “పవన్‌తో నేను ‘మెరిసే మెరిసే’ చిత్రానికి పని చేశాను. ఈ చిత్రంలోనూ మంచి పాటలు పడ్డాయి” అని మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి కొడకండ్ల అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు సాహిబ బాసిన్, స్నేహా మాల్వియ, నటి ఝాన్సీ, ఎడిటర్ ఉద్దవ్, కెమెరామెన్ సజీష్ రాజేంద్రన్‌లతో పాటు అనుదీప్ దేవ్ పాల్గొన్నారు.