calender_icon.png 21 December, 2024 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4.5 శాతానికి సగటు ద్రవ్యోల్బణం

16-10-2024 12:20:45 AM

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర చెప్పారు. మంగళవారం నాడిక్కడ ఒక సదస్సులో పాత్ర మాట్లాడుతూ 2025-26 సంవత్సరంలో తమ 4 శాతం లక్ష్యానికి ద్రవ్యోల్బణం చేరువగా ఉంటుందన్నారు.

వినిమయ ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అదుపు చేయాలని ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించింది. గత మూడు నెలల్లో 4 శాతం మధ్యలో నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అధికారి మాట్లాడుతూ వచ్చే 2025-26లో 4 శాతం వద్ద స్థిరపడే ముందు ఈ ఏడాది సగటున 4.5 శాతం వద్ద కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. 

షాకిస్తున్న ఆహార, ఇంధన ధరలు

దేశానికి పదేపదే ఆహార, ఇంధన ధరలు షాక్‌లు ఎదురవుతున్నాయని, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ఇది సవాలుగా మారిందని పాత్ర వాపోయారు. ధరల స్థిరత్వం అనేది ప్రభుత్వం, ఆర్బీఐల ఉమ్మడి బాధ్యత అని, ఈ బాధ్యత కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సాధిస్తుందని చెప్పారు. ఆర్థిక స్థిరత్వానికి, వృద్ధికి రిస్క్‌లు ఏర్పడకుండా ఉమ్మడి బాధ్యతతో ద్రవ్య, ఆర్థిక విధానాల పరస్పర సహకారం కొనసాగుతున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వివరించారు.