హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ‘అవతార్’ ప్రపంచ సినిమా పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. పండోర అనే ఊహాజనిత గ్రహాన్ని, అందులోని ప్రకృతి సౌందర్యాలను అద్భుత విజువల్ ఎఫెక్ట్స్‌తో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది అవతార్. 2022లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో రాగా మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు కామెరూన్.
ఇప్పుడు, ఆ ఫ్రాంచైజీలో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరిట రూపొందుతోంది. పార్ట్ అగ్ని ప్రధానమైన అంశంగా రూపొందిస్తున్నారు. ఈ మూడో భాగం గురించి ఆసక్తికర విషయాలను డైరెక్టర్ వెల్లడించారు. జేమ్స్ కామెరూన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గత రెండు చిత్రాల కంటే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాం.
తెరపై ఈ విజువల్ వండర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతారు. రెండు భాగాల్లో చూపిన అంశాలను ఎక్కడా పునరావృతం చేయకుండా కొంగొత్త, సాహసోపేతమైన ఎంపికలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈసారి కథనంలో పూర్తిగా కొత్తదనాన్ని అందిస్తాం. పాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ భాగంలో మీరు లైవ్-యాక్షన్ అదనపు అద్భుతాలను చూస్తారు.
పండోర అనే కొత్త ప్రపం చం, వినూత్నమైన పాత్రలతో విభిన్నమైన అను భూతిని ఇస్తాం. ఈ సినిమా ప్రేక్షకులను మరో స్థాయిలో కట్టిపడేస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని, డబ్బును న్యాయం గా వినియోగించుకుంటున్నట్టు భావిస్తారు’ అని చెప్పారు.
కామెరూన్ తాజా వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కొత్త ప్రపంచం, విభిన్నమైన కథనం, అలరించే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్’ మూడో భాగం మరో సంచలనం సృష్టించనున్నట్టు తెలుస్తోంది. మూడో భాగం 2025 డిసెంబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘అవతార్ 4’ 2029లో, ‘అవతార్ 5’ 2031 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.