01-03-2025 01:12:44 AM
డెహ్రాడూన్, ఫిబ్రవరి 28: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో శుక్రవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ మంచు చరియల కింద 57 మంది కూలీలు చిక్కుకోగా వారిలో 32 మం దిని రెస్క్యూ సిబ్బంది దగ్గరలో ఉన్న క్యాంపునకు తరలించారు. మిగిలిన 25 మంది కూలీలను రక్షించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది.
దీంతో భారత సైన్యం ఇండియా సరిహద్దుకు చేరుకోవడానికి వీలు లేకుండా మనా గ్రామం, మనా పాస్‌ల మధ్య లో గల బద్రీనాథ్ జాతీయ రహదారిపై మంచు పేరుకుపోయింది. రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు 57 మంది కూలీలు రంగంలోకి దిగారు. మంచు తొలగిస్తుండగా మంచు చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో 57 మంది మంచు చరియల కింద చిక్కుకున్నారు. విషయం తెలియగానే ఇండో టిబెటియన్ పోలీసులతో కలిసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌వో) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే 32 మంది కూలీలను మంచు చరియల కింద నుంచి వెలికి తీసి దగ్గర్లోని ఆర్మీ క్యాంపునకు తరలించారు. మిగిలిన కూలీలను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది రక్షిం చిన 32 మందిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు.
మంచు చరియల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే విపత్తు నిర్వహణ బృందాన్ని అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకా కుండా కార్మికులను రక్షించడమే లక్ష్యం గా ప్రభుత్వం పని చేస్తుందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.