calender_icon.png 23 April, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'మహాలక్ష్మి'తో నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలి

22-04-2025 06:58:03 PM

సంక్షేమ బోర్డు చట్టంకై రవాణారంగ కార్మికులు ఉద్యమించాలి..

ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా..

కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 'మహాలక్ష్మి' పథకంతో నష్టపోయిన ఆటో రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని, నష్ట నివారణగా ప్రతి కార్మికుడికి నెలకు రూ.12 వేలు పరిహారం అందించి ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ క్రాస్ రోడ్డులో ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన అడ్డా ఏర్పాటు చేశారు. అడ్డా ప్రారంభం సందర్బంగా ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన కార్మికుల సమావేశంలో అయన మాట్లాడారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో రవాణారంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జరుగుతున్న పోరాటాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ప్రజల సంక్షేమానికి అవసరమయ్యే చట్టాలు కాకుండా ఇబ్బందులకు గురిచేసే చట్టాలను తీసుకువస్తున్నారని విమర్శించారు. సంక్షేమ బోర్డుకు ఉద్యమాల ఉదృతిని పెంచాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆటో కార్మికులకు ప్రప్రాధాన్యత ఇవ్వాలని, భీమా సౌకర్యం, పెన్షన్ పథకాలు అమలుచేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందింస్తూ పరిష్కారానికి కృషి చేయాలని యూనియన్ నాయకత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య, ఏఐటిసి జిల్లా కార్యదర్శి గెద్దాడి నగేష్, మాజీ కౌన్సిలర్లు భూక్యా శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి. సత్యనారాణ చారి, గుత్తుల శ్రీనివాస్, మిర్యాల రాము,  యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, ఉపాధ్యక్షులు ఆరేల్లి కృష్ణ, నాయకులు గాబ్రియేల్,  ఎస్డి పాషా,  గోవర్ధన్, సాయి, నరేష్, బాబూరావు, శ్రీనివాస గౌడ్, విజ్జి, బాబు రావు,  చాతకొండ ఆటో కార్మికులు పాల్గొన్నారు.