ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీకి దీటుగా మారుమూల పల్లె ప్రజలకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని, వారి సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మేల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ ఆటో, క్యాబ్ అండ్ ప్రైవేట్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర తృతీయ మహాసభలను ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తరహాలో దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న రవాణారంగ కార్మికుల సంక్షేమ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు లక్ష్మిదేవిపల్లి మండల వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి కొత్తగూడె క్లబ్ వరకు ఆటోలు, ప్రవేటు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.