calender_icon.png 3 April, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ మృతి

02-04-2025 11:33:56 PM

న్యాయం చేయాలంటూ నాగోల్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన..

కేసు దర్యాప్తు చేస్తున్నాం.. సీఐ ఏ.సూర్య నాయక్

ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాతుపల్లి గ్రామం, దాచుపల్లి తండాకు చెందిన నేనావత్ ఉష (46) భార్యా పిల్లలతో కలిసి కొన్నేళ్లుగా నాగోల్ సమీపంలోని నోముల బండ ప్రాంతంలో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

గత నెల 26న ఉదయం నాగోల్ నుంచి జైపూర్ కాలనీకి వెళ్లే రహదారిపై ఆటో (టీఎస్ 05 టి 4036)లో వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న చంద్రగిరి శీను, అతడి భార్య తరుణి కుమారి గాయపడ్డారు. ఆటో డ్రైవర్ నేనావత్ ఉష కూడా తీవ్ర గాయాలపాలై చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం సాయంత్రం నాగోల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ సూర్య నాయక్ బాధితులను సముదాయిస్తూ, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుస్తున్నట్లు సీఐ తెలిపారు.