19-03-2025 12:51:55 AM
ఎమ్మెల్యే దానం నాగేందర్..
హైదరాబాద్ (విజయక్రాంతి): తన క్యాంపు ఆఫీస్‌కు స్థలం కేటాయించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన నియోజకవర్గంలో అనుమతి లేకుండా సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారని, అందుకే తన స్టుల్‌లో శిలాఫలకాన్ని పగులగొట్టినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం జీరో అవర్‌లో దానం నాగేందర్ మాట్లాడారు. క్యాంపు ఆఫీసుకు స్థలం కావాలని విజ్ఞప్తి చేసినప్పటికీ దానిని పక్కనబెట్టి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారని విమర్శించారు.
అధికారుల తీరు నచ్చకనే శిలాఫలకం కూలదోల్చినట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. సోషల్ మీడియా పోస్టులకు వెంటనే స్పందించే అధికారులు.. ఎమ్మెల్యే ఫిర్యాదును పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. అధికారుల తీరును తప్పుబడుతూ తాను ఒక సీనియర్ ఎమ్మెల్యేనని, ఏం మాట్లాడాలో తెలుసని, ఎవరు చెప్పాల్సిన పని లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.