calender_icon.png 12 October, 2024 | 8:53 PM

ఆస్ట్రేలియా చిత్తుగా

29-09-2024 12:00:00 AM

  1. నాలుగో వన్డేలో ఇంగ్లండ్ విజయం 
  2. సిరీస్ సమం.. నేడు చివరి వన్డే

లండన్: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 186 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2 సమం చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోరు చేసింది.  బ్రూక్ (58 బంతుల్లో 87; 11 ఫోర్లు, 1 సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 62; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అంతకముందు బెన్ డకెట్ (63) రాణించాడు.

ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (34) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ 4 వికెట్లతో ఆసీస్‌ను శాసించగా.. బ్రిడన్ కార్స్ 3 వికెట్లు తీశాడు. నిర్ణయాత్మక చివరి వన్డే నేడు జరగనుంది.

బ్రూక్ క్లాస్.. లియామ్ మాస్

 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ బెన్ డకెట్ క్లాస్ అర్థసెంచరీ సాధించాడు. 17 ఓవర్లలో వంద పరుగులు దాటిన ఇంగ్లండ్ ఆ తర్వాతి 22 ఓవర్లలో 212 పరుగులు చేయడం గమనార్హం. మిడిలార్డర్‌లో మొదట కెప్టెన్ బ్రూక్ క్లాస్ మాస్ కలగలిపిన ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఆ తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

బంతి పడిందే ఆలస్యం స్టాండ్స్‌కు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. వన్డేల్లో టీ20 ఆటను చూపించిన లివింగ్‌స్టోన్ 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అతనికి తోడు జేమీ స్మిత్ కూడా ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ కలిసి రాలేదు.

ఓపెనర్లు మినహా మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిచెల్ మార్ష్ (28)తో కలిసి హెడ్ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. హెడ్, మార్ష్ ఔటైన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కాగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.