calender_icon.png 30 October, 2024 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగళకరంగా మంగళ్ ఉత్సవ్

15-07-2024 02:26:53 AM

అంబానీ ఇంటి కొనసాగుతున్న పెండ్లి వేడుకలు  n  ఆదివారం వైభవంగా నిర్వహించిన మంగళ్ ఉత్సవ్

భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట వివాహ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా నిర్వహించగా, శనివారం శుభ ఆశీర్వాద్ కార్యక్రమం జరిగింది. ఆదివారం మంగళ్ ఉత్సవ్ కూడా వైభవంగా జరిగింది. శుభ ఆశీర్వాద్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పీఠాల అధిపతులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం రిసెప్షన్‌కు కూడా అనేకమంది ప్రముఖులు తరలివచ్చారు. 

నరేంద్రమోదీకి ఆశీర్వాదం

అంబానీ ఇంట పెండ్లిలో ప్రధాని నరేంద్రమోదీకి ఇద్దరు పీఠాధిపతులు ఆశీర్వచనం అందించారు. ద్వారక పీఠం శంకరాచార్యులు స్వామి సదానంద సరస్వతి, జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద్ వద్దకు ప్రధాని వెళ్లి ఆశీర్వాదం తీసుకొన్నారు. స్వామి సదానంద సరస్వతి తన మెడలోని రుద్రాక్షమాలను తీసి మోదీకి స్వయంగా అలంకరించారు. స్వామి అవిముక్తేశ్వరానంద తన వద్ద ఉన్న కాషాయ కండువాను మోదీ మెళ్లో వేసి ఆశీర్వదించారు

లండన్‌లోనూ వేడుకలు

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివా హ వేడుకలు ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించటంలేదు. ఆదివారం మంగళ్ ఉత్సవ్ కార్యక్రమంతో అధికారికంగా ముగిసినా.. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు జరుగనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో వేడుకలు నిర్వహించగా, మరికొన్ని రోజులు విదేశాల్లో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వేడుకలను జరుగనున్నట్టు తెలిసింది. ఈ వేడు కలకు బ్రిటన్ రాజధాని లండన్ వేదిక కానున్నది. అత్యంత విలాసవంతమైన క్యూయిజ్ షిప్‌లో ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ తీరం మీదుగా బ్రిటన్ వరకు సముద్ర అలలపై వేడుకలు నిర్వహించనున్నట్టు సమాచారం. 

ప్రపంచ నేతల ఆశీర్వచనాలు.. 

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అధినేతలు తరలివచ్చారు. కేవలం వ్యాపార వేత్తలనే కాకుండా అనేక మంది ఈ నూతన జంటను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు. బిల్‌గేట్స్, జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, జాన్‌సీనా, కిమ్‌కర్దాషియాస్, గౌతమ్ అదానీ, టోనీ బ్లేయిర్, రిహానా, మైక్‌టైసన్, డేవిడ్‌బెక్‌హోమ్, అమితాబ్‌బచ్చన్, రజినీకాంత్, షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, రణబీర్ కపూర్, సంజయ్‌దత్, కరణ్ జోహార్, వెంకటేష్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జాన్వీ కపూర్, ప్రియాంకా చోప్రా వంటి ప్రముఖులు హాజరయ్యారు. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్, కెప్టెన్ కూల్ ధోనీ, హిట్ మ్యాన్ రోహిత్, టీమిండియా తురుపుముక్క హార్దిక్ పాండ్యా, బూమ్.. బూమ్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్ వంటి వారెందరో హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, చాలా మంది మరాఠా నేతలు కూడా హాజరయ్యారు. ఇక మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివాహ వేడుకకు హాజరయి నూతన దంపతులకు ఆశీర్వచనాలు తెలిపారు. 

పీఠాధిపతుల ఆశీర్వచనాలు

కొత్త దంపతులకు దేశంలోని వివిధ పవిత్ర పీఠాల నుంచి వచ్చిన అధిపతులు ఆశీర్వచనం అందించారు. ద్వారక పీఠం శంకరాచార్యులు స్వామి సదానంద సరస్వతి, జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద  శుభ ఆశీర్వాద్ వేడుకలకు విచ్చేశారు. వారికి అఖండ స్వాగతం పలికిన ముఖేశ్ అంబానీ దంపతులు.. ఆశీర్వాదం తీసుకొన్నారు. అనంతరం కొత్త దంపతులకు పీఠాధిపతులు ఆశీర్వచనం ఇచ్చారు.  

  1. అతిథులకు 2 కోట్ల  వాచీలు గిఫ్ట్
  2. అట్టహాసంగా అనిల్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక

ముంబై, జూలై 14 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనిల్ అంబానీ, ఫార్మారంగ వ్యాపార వేత్త వీరేన్, శైల మర్చంట్‌ల కూమార్తె రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అట్టహాసంగా జరిగింది. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకలో దేశ, విదేశాలనుంచి అతిరధమహారథులు పాల్గొన్నారు. వివాహానికి హాజరైన అతిథులు, స్టార్ హీరోలకు అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను అందజేసిట్లు తెలుస్తోంది. అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ విలువ దాదాపు రూ.2కోట్ల పైగా ఉంటుందని .. అతిథుల కోసం అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా తయారుచేయించినట్లు సమాచారం. బాలీవుడ్ నటులు సల్మాన్, షారుఖ్, రణ్‌వీర్ సింగ్ ఆయా వాచీలతో  దిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కాగా వేలకోట్లు ఖర్చుచేసి అనంత్, రాధికల పెళ్లి చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

సెలబ్రిటీ కార్నివాల్‌లా వేడుక

ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. వందలమంది ఒకేచోట చిందులేస్తూ వేడుకలో జోష్ నింపారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే భారత క్రికెట్ జట్టు మాజీ సారధి ఎంఎస్ ధోనీ కూడా వేడుకలో కాలు కదుపటం చూస్తే ఉత్సవాలు ఎంత కోలా హలంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

అత్తాకోడళ్లు, ఆడపడుచు

అంబానీ ఇంట పెండ్లి వేడుకల ఖరీదు గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుం డగా, అంత కుమించి మరొక విషయం ఆసక్తి కరంగా మారింది. ముఖేశ్ అంబానీ ఇంట పెండ్లి పూర్తిగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబిం బించింది. అంతేనా.. భారత సమాజానికి మూల స్తంభం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని కూడా మరోసారి గుర్తు చేసింది. 13వ తేదీన శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ సతీమని నీతా అంబానీ, ఆమె కుమార్తె ఈశా అంబానీ, పెద్ద కోడలు శ్లో మెహతా, చిన్న కోడలు కోడలు రాధిక మర్చంట్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో అమితంగా ఆకర్శించింది. తన తర్వాతి తరాన్ని నీతా అంబానీ ఎంతో ఆప్యాయంగా ఆలింగ నం చేసుకొన్న ఈ చిత్రం భారతీయ సంస్కృతికి అద్దం పట్టింది. 

పిలువని పేరంటానికి వెళ్లి..

ప్రపంచమే ఔరా అని అబ్బురపడుతున్న అంబానీ ఇంట పెండ్లికి ఇద్దరు వ్యక్తులు పిలువని పేరంటానికి వెళ్లి పోలీసులకు పట్టుబడ్డారు. దేశవిదేశీ ప్రముఖులు హాజరైన ఈ వెడుకలకు భద్రత కూడా గట్టినే చేశారు. అన్యులు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా చర్యలు తీసుకొన్నారు. అయినా ఓ యూట్యూబర్‌తోపాటు మరో వ్యక్తి పెండ్లి మండపంలోకి వెళ్లారు. వెంకటేశ్ నరసయ్య నల్లూరి (26) అనే యూట్యూబర్, లుక్మన్ మొహమ్మద్ షరీఫ్ షేక్ (28) అనే బిజినెస్ మ్యాన్ ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ముంబై పోలీసులు తెలిపారు. ఇద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి ఆ తర్వాత వదిలేశారు. 

దేశంలోని అత్యంత ఖరీదైన ఐదు వివాహాలు

అనంత్ అంబానీ వెడ్స్ రాధిక మర్చంట్

భారతీయ బిలియనీర్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహం ప్రపంచమే అబ్బురపడేలా జరిగింది. ఈ వివాహ కార్యక్రమాలు దాదాపు 7 నెలలపాటు కొనసాగటం విశేషం. ఈ నెల 12న వివాహం, 13 శుభ ఆశీర్వాద్, 14 మంగళ ఉత్సవ్ నిర్వహించారు. ఈ వివాహానికి దాదాపు రూ.5000 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పెండ్లికి హాజరైన ప్రముఖులకు ప్రతి ఒక్కరికి బహుమతులుగానే దాదాపు రూ.2 కోట్ల విలువైన రిస్ట్‌వాచీలను అందించారట. 

ఈశా అంబానీ ఆనంద్ పిరమల్

మరో ఖరీదైన వివా హం కూడా ముఖేశ్ అం బానీ ఇంట్లోనే జరిగింది. ఆయన ఒక్కగానొక్క కూతు రు ఈశా అంబానీ, ఆనంద్ పిరమల్ వివా హం 2018లో జరిగింది. ఈ పెండ్లికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. పెండ్లి లో ఈశా ధరించిన లెహంగా ఖరీదే రూ.90 కోట్లు ఉంటుందట. 

రాయ్ వెడ్డింగ్

ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్రతోరాయ్ తన ఇద్దరు కుమారులకు ఒకే ముహూర్తంలో 2004లో వివాహం జరిపించారు. సుశాంతోరాయ్‌తో రిచా అహూజా, సీమంతో రాయ్‌తో చాంతినీ తూర్ వివాహం జరిగింది. ఈ వివాహానికి రూ.554 కోట్లు ఖర్చు చేశారట. ఈ పెండ్లికి దేశ విదేశాల నుంచి 11 వేల మంది అతిథులు హాజరయ్యారు. 

గాలి ఇంట ఘనంగా వివాహం

కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో జరిగిన వివాహం కూడా అత్యంత ఖరీదైన పెండ్లిళ్లలో ఒకటిగా నిలిచింది.  2016లో జనార్ధన్‌రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం విజయ్‌రెడ్డితో బెంగళూరులో జరిగింది. ఈ పెండ్లికి దాదాపు రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. 

ఉక్కు వ్యాపారవేత్త ప్రమోద్ మిట్టల్ కుమార్తె సృష్టి మిట్టల్ వివాహం 2013లో స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి.