- ట్రంప్ పగ్గాలు చేపట్టాక భారీ సంస్కరణలు
- రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి
వాషింగ్టన్ డీసీ, నవంబర్ 16: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉన్నట్లు రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి తెలిపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వా త తాను, ఎలన్ మస్క్ అదే పనిలో ఉంటామని రామ స్వామి తేల్చిచెప్పారు.
దీంతో వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్ మార్ ఏ లాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో.. అమెరికాలోని లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి మూకుమ్మడిగా తొలగించే పదవిలో తాను, ఎలన్ మస్క్ ఉన్నట్లు చెప్పారు.
ఇంకా రామస్వామి మాట్లాడుతూ.. ‘ఎలన్ మస్క్ గురించి ఇంకా మీకు తెలుసో లేదో.. ఆయన ఉలి కాదు ఏకంగా రంపం తీసుకువచ్చారు. దానిని మేము బ్యూరోక్రసీపై ఉపయోగించాలి’ అని అనుకుంటున్నాం. గత నాలుగేళ్లలో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రభుత్వంలో అమెరికా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఈ క్రమంలో నిబద్ధత, కఠిన శ్రమతో అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు మేం సిద్ధం అవుతున్నమని రామస్వామి స్పష్టం చేశారు.