- ఈ నెలలో ముగియనున్న గడువు
- స్కీం కొనసాగింపుపై సందిగ్ధత
- జలమండలి నిర్ణయంపై కాంట్రాక్టర్ల ఎదురుచూపు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): జలమండలి పరిధిలోని ఓఅండ్‌ఎం డివిజన్లలో సీవరేజీ, వాటర్ పైప్‌లైన్ డ్యామే జీ పనుల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. రెండే ళ్లుగా యాన్యువల్ మెయింటెనెన్స్ స్కీం (ఏఎంఎస్) పేరిట వివిధ డివిజన్లలోని సీవరేజీ, మంచినీటి సరఫరా డ్యామేజీలకు కాంట్రాక్టర్లు మరమ్మతులు చేపడుతుండగా, రెండేళ్ల గడువుతో 2022 నవంబర్‌లో ఈ స్కీం ప్రారంభమైంది.
ఆ గడువు ఈ నెలలో ముగియనున్నట్లు తెలిసింది. దీంతో స్కీం ఇకపై కొనసాగుతుందా.. లేదా అనే ప్రశ్న జలమండలిలో తలెత్తింది. సర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనని అధికార వర్గాలతో పాటు కాంట్రాక్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇప్పటికే జల మండలి ఎండీ అశోక్‌రెడ్డిని కలిసి స్కీంను కొనసాగించాలని కోరినట్లు సమాచారం.
త్వరలో గడువు పూర్తి
జలమండలి పరిధిలో మొత్తం 27 ఓఅండ్‌ఎం డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సీవరేజీ పైప్‌లైన్, మ్యాన్‌హోళ్ల డ్యామేజీ, వాటర్ పైప్‌లైన్ తదితర మరమ్మతుల కోసం రెండేళ్ల నుంచి ఏఎంఎస్ విధానం అమలవుతున్నది. 2022కు ముందు ఆయా పనులను కాంట్రాక్టర్లే నిర్వహించేవారు. జనరల్ మేనేజర్(జీఎం) స్థాయి అధికారి పనులను పర్యవేక్షించేవారు.
చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) పేరిట ఎల్వోసీ పనులు సాగేవి. దీనిలో భాగంగానే డివిజన్ల పరిధిలోని సెక్షన్లలో ఉత్పన్నమయ్యే డ్యామేజీల పనులు పూర్తయ్యేవి. ఆ పనులకు జీఎంకు ప్రతినెలా రూ.50 వేల చొప్పున నిధులు విడుదలయ్యేవి. అవసరాన్ని బట్టి ఆ నిధులు పెరిగేవి. కార్యాలయాల పరిధిలో కాంట్రాక్టర్లే నామినేషన్ పనుల పేరిట మరమ్మతులు సైతం చేసేవారు.
పనుల పర్యవేక్షణ పూర్తిగా జీఎం పరిధిలోనే ఉండేది. అయితే అనేక కారణాల రీత్యా ఆ పద్ధతిని సర్కార్ ఎత్తేసిందని తెలుస్తోంది. ఆ స్థానంలోనే ఏఎంఎస్ అమలు చేసింది. అధికారులు చేపట్టిన పనులను పర్యవేక్షించి నెల వారీగా ఎంత ఖర్చ వుతుందనే అంచనాతో ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు ఏఎంఎస్ పనుల అప్పగింత జరిగింది. రెండేళ్ల పేరిట ఒక్కో కాంట్రాక్టర్ డివిజన్ల పరిధిలో రూ.20 లక్షల రూ.40 లక్షల వరకు పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.
పనులపై పర్యవేక్షణ
రెండేళ్ల క్రితం జలమండలి అమలులోకి తీసుకొచ్చిన ఏఎంఎస్‌తో పనులు సకాలంలో జరుగుతున్నట్లు అధికార అభిప్రాయపడుతున్నాయి. సేఫ్టీ ప్రొటోకాల్ టీం కూడా ఈ పనులను పర్యవే క్షిస్తున్నట్లు తెలిసింది. పనులకు రెండు మూడు నెలలకోసారి జలమండలి బిల్లులను చెల్లిస్తోంది. కానీ, కొంతకాలం నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారని సమాచారం.
పనుల అంచనా క్రమంగా పెరుగుతుండడంతో జలమండలిపై కొంతభారం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ స్కీం గడువు ముగియనున్న నేపథ్యంలో జలమండలి ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. సర్కార్ జలమండలి ఆదా యం పెంచుతూనే, మరోవైపు ఖర్చులు తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే పెండింగ్ బిల్లులపై వడ్డీ రాయితీనీ ప్రకటించింది.