calender_icon.png 5 November, 2024 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔరంగ్‌జేబ్ వర్సెస్ అబ్దాలీ

05-08-2024 02:04:46 AM

  1. వేడెక్కుతున్న మహారాష్ట్ర రాజకీయం
  2. అమిత్ షా, ఉద్ధవ్ మధ్య మాటల యుద్ధం
  3. ముస్లిం రాజుల వారసులంటూ విమర్శలు

ముంబై, ఆగస్టు 4: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్ది అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతున్నది. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నావాళ్లు కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పించుకొంటున్నారు.

ముఖ్యంగా పాత మిత్రులు బీజేపీ, శివసేన (యూబీటీ) మధ్య మాటకు మాట అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ రాజకీయ పోరాటంలో మధ్యయుగ ముస్లింరాజులను కూడా భాగస్వాములను చేశారు. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.  

మాటల తూటాలు

గత నెల 21వ తేదీన పుణెలో బీజేపీ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన అమిత్ షా విపక్షాలపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) కలిసి మహా వికాస్ అగాఢీ కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కూటమిని ‘ఔరంగ్‌జేబ్ ఫ్యాన్స్ క్లబ్’ అని అమిత్ షా సంబోధించారు.

ఆ క్లబ్‌కు ఉద్ధవ్ ఠాక్రే నాయకుడని విమర్శించారు. ‘ఎంవీఏ కూటమి ఔరంగ్‌జేబ్ ఫ్యాన్స్ క్లబ్. ఈ క్లబ్ దేశాన్ని కాపాడలేదు. ఆ క్లబ్‌కు ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు. అది మహారాష్ట్రనుగానీ, ఇండియానుగానీ సురక్షితంగా ఉంచలేదు. కసబ్‌తో సంబంధాలున్నవాళ్లతో కూడా ఉద్ధవ్ కలిసి భోజనం చేశారు.

ఆయన పీఎఫ్‌ఐకి మద్దతిచ్చారు. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా మార్చటాన్ని వ్యతిరేకించారు’ అని ఆరోపించారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై కూడా షా విమర్శలు గుప్పించారు. షా వ్యాఖ్యలకు పవార్ వెంటనే కౌంటర్ ఇవ్వగా, ఉద్ధవ్ పుణె వేదికగానే షాపై మాటల దాడి చేశారు.

‘మా హిందూత్వ విధానం గురించి వివరించిన తర్వాత కూడా ముస్లింలు మాతో ఉండటం బీజేపీ దృష్టిలో ఔరంగ్‌జేబ్ ఫ్యాన్స్ క్లబ్. మరి మీరు చేస్తున్న పవర్ జిహాద్ సంగతేంటి? అమిత్ షా ఆఫ్గాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి రాజకీయ వారసుడు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. శరద్‌పవార్ గతంలోనే షాపై మండిపడ్డారు.