calender_icon.png 7 January, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఆరాంఘర్‌జూపార్క్ ఫ్లుఓవర్ ప్రారంభం

06-01-2025 01:17:26 AM

* రూ.800 కోట్ల వ్యయంతో 6 లేన్లు, 4.08 కిలోమీటర్ల పొడవు

* నగరంలో రెండో అతిపెద్ద ఫ్లుఓవర్‌గా రికార్డు

*  ప్రజలకు అంకితంచేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేసిన నగరంలోనే రెండో అతి పెద్ద ఫ్లుఓవర్ ఆరాంఘర్  జూపార్కు ఫ్లుఓవర్ సోమవారం ప్రారంభం కానుంది. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో 4 కిలోమీటర్లకు పైగా 6 లేన్లతో నిర్మించిన ఈ ఫ్లుఓవర్‌ను సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

2021లో ప్రారంభమైన ఈ ప్లుఓవర్ 2024లో పూర్తయ్యింది. వాస్తవానికి ఈ ఫ్లుఓవర్‌ను 2024 డిసెంబర్ మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అధికారులు భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడింది. నగరంలోని పీవీ నరసింహ రావు ఎక్స్‌ప్రెస్ వే(11.66 కిలోమీటర్లు) దేశంలోనే అతిపెద్ద ఫ్లుఓవర్‌గా ప్రసిద్దికెక్కింది. ఆ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లుఓవర్‌గా ఆరంఘర్ టు జూపార్క్ ఫ్లుఓవర్ నిలవనుంది.

ఆరంఘర్ టు జూపార్క్ ఫ్లుఓవర్ అందుబాటులోకి రావడంతో శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్ట్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులు, ప్రయాణికుల రాకపోకలు మరింత సులువు కానున్నాయి. అలాగే గ్రేటర్ వ్యాప్తంగా ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మొత్తం 42 పనులలో 22 ఫ్లుఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 6 ఆర్‌యూబీలతో పాటు మరో 3 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తిచేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.