calender_icon.png 8 September, 2024 | 8:51 AM

ఆగస్టు 2 డెడ్‌లైన్!

27-07-2024 04:42:10 AM

ఆలోపు కాళేశ్వరం పంపులు ఆన్‌చేయాలి

  1. లేదంటే 50 వేల మంది రైతులతో వచ్చి మేమే ఆన్ చేస్తాం
  2. పంపుల ఆన్‌పై అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెడుతాం
  3. రాజకీయ లబ్ధి కోసమే నీళ్లు కిందికి వదిలేస్తున్న ప్రభుత్వం
  4. రైతులకు నీళ్లిచ్చే ఆలోచన కాంగ్రెస్ సర్కారుకు లేదు
  5. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
  6. మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన

జయశంకర్ భూపాలపల్లి/పెద్దపల్లి, జూలై 26 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులను వెంటనే ఆన్‌చేసి రిజర్వాయర్లు నింపాలని ప్రభు త్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. పంపులు ఆన్ చేసేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు గడువు ఇస్తామని, ఆగస్టు 2వ తేదీలోగా పంపు లు ఆన్ చేయాలని అల్టిమేటం జారీచేశారు. లేని పక్షంలో తమ నాయకుడు కేసీఆర్‌తో ఒక తేదీని నిర్ణయించుకొని 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌లను ఆన్ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ తరఫున వాయిదా తీర్మానం కూడా ఇస్తామని ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద గల మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాన్ని పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లా డుతూ.. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం బరాజ్‌లలో నీళ్లు ఆపకుండా కిందికి వదిలేస్తున్నదని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు శిథిలమైనట్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడైనా చిన్న లోపం కన్పిస్తే దాన్ని భూతద్దం లోపెట్టి చూపిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షల క్యూసెక్కుల నీళ్లను వృధాగా వదిలేస్తున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే కల్పతరువు అని అన్నారు.

ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లోని గోదావరి నదిలో నీళ్లు లేవని, మేడిగడ్డ వద్ద మాత్రమే పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఈ నీటిని ఎగువకు ఎత్తిపోస్తే రిజర్వాయర్లన్నీ నిండి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు నీళ్లు అందించాలనే ఆలోచనే చేయడం లేదని దుయ్యబ ట్టారు. గత రబీ సీజన్‌లో ప్రాజెక్టులను నింపి రైతులకు సాగునీరు అందించాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. బరాజ్‌లలో నీళ్లు నిలిపితే ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం అబద్ధమని తేలుతుందనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని, అందుకే నీళ్లను సముద్రంలో కలిసేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో గోదావరి నది నిండుకుండలా ఉండేదని, సాగునీటికి కష్టాలు లేకుండేవని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఒక్క బటన్ నొక్కితే పైన ఉన్న ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీలను నింపవచ్చని చెప్పారు. 

త్రిలింగ క్షేత్రంలో కేటీఆర్ పూజలు

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా శుక్రవారం త్రిలింగక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో కేటీఆర్ పూజలు చేశారు. కాళేశ్వర క్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందంతోపాటు కేటీఆర్‌కు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడి నుంచి గోదావరి నది తీరానికి వెళ్లి గోదావరి మాతకు పూజలు చేశారు.  

నాడు నిండు కుండ.. నేడు ఎడారి

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిండు కుండలా ఉన్న గోదావరి, నేడు నీళ్లు లేక ఎడారిలా మారిందని కేటీఆర్ అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తూ గోదావరిఖనిలో గోదావరి నది వంతెన వద్ద ఆగి నదిని పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం లేక పోవడంతోపా ఈ వర్షకాలంలో ఎడారిలా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.