calender_icon.png 15 November, 2024 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో ఆడిటింగ్ హడల్

04-11-2024 01:27:30 AM

  1. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలపై గురి
  2. జీపీ అకౌంట్లలో ఉన్న జీఎస్‌టీ డబ్బు మళ్లింపుపై దృష్టి
  3. పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో తాము బలవుతామని జీపీ కార్యదర్శుల ఆందోళన

మెదక్, నవంబర్ 3 (విజయక్రాంతి): గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులంతా ఇప్పుడు తాజా మాజీలయ్యారు. వారు గతంలో చేపట్టిన హరితహారం, పారిశుద్ధ్యం, సెగ్రిగేషన్ షెడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధులపై ఇప్పుడు ఆడిటింగ్ జరుగుతోంది.

నాడు సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే ఆ పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నెలతో వారి పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులే పంచాయతీలకు బాధ్యులుగా ఉన్నారు. సర్పంచ్‌ల కాలపరిమితి పూర్తికావడంతో పంచాయతీల పాలన భారమంతా కార్యదర్శులపైనే పడింది.

ఇలాంటి తరుణంలో గ్రామాల్లో రెండు, మూడేళ్ల కింద పూర్తయిన పనులపై ఆడిట్ చేపట్టడంతో కార్యదర్శులు హడలిపోతున్నారు. ఆడిటింగ్ నివేదికలో ఏం బయపడుతుందోనని, ఉన్నతాధికారులు తమను బాధ్యులను చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో కొనసాగుతున్న ఆడిట్..

మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఆడిటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అప్పట్లో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులంతా ఇప్పుడు కలెక్టరేట్‌కు వెళ్లి, పనులకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి వస్తున్న ది. గతంలో పంచాయతీల్లో జరిగిన పనులకు సంబంధించి జీఎస్టీ కట్ చేసి, ఏఈ చేసిన బిల్లుల ఆధారంగా పంచాయతీ పాలకవర్గాలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించా యి.

స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ సొమ్ము తర్వాత పంచాయతీల అకౌంట్లలోనే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. వాస్తవానికి జీఎస్టీ కింద 18 శాతం కట్ చేసిన డబ్బును ఆయా కార్యాలయాల్లో చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో జీఎస్టీ సొమ్మును ఎందుకు జీఎస్టీ శాఖలకు జమ చేయలేదంటూ అప్పుడు పనిచేసిన కార్యదర్శులను పిలిపించి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

దీనిపై జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, పైగా ఎలా చెల్లించాలనే ప్రాసెస్ కూడా తమకు తెలియదని కార్యదర్శులు వాపోతున్నారు. జీఎస్టీ చెల్లించలేదని, ఆ సొమ్ము పంచాయతీల అకౌంట్లలో ఉండిపోయిందని సమాచారం. నాడు ఒక పంచాయతీలో పనిచేసిన కార్యదర్శుల్లో కొందరు బదిలీపై వెళ్లారు. ఇప్పుడు వారందరినీ పిలిపించి, ఆడిటింగ్ చేపడుతుండ డంతో కార్యదర్శుల్లో ఆందోళన మొదలైంది.

20 రోజుల్లో ఆడిట్ పూర్తవుతుంది

జిల్లాలో ఆడిట్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రక్రియ మరో 20 రోజుల్లో పూర్తి చేస్తాం. ఆడిట్ నిరంతర ప్రక్రియ. ప్రతీది ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. ప్రస్తుతం పంచాయతీల్లో సర్పంచ్‌లు చేపట్టిన అభివృద్ధి పనులపై ఆడిట్ నిర్వహిస్తున్నాం. ప్రత్యేక పాలన అధికారులకు సంబంధించిన ఆడిట్ వచ్చే సంవత్సరం నిర్వహిస్తాం. 

 రాకేష్, 

ఆడిట్ జిల్లా అధికారి, మెదక్