న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల ఉత్పత్తుల సంస్థ ఆడీ మరోసారి తమ వాహనాల ధరలను సవరించనుంది. భారత్‌లో విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్లపై గరిష్ఠంగా 3శాతం ధరలు పెంచనున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు తెలిపింది. రవాణా ఛార్జీలతో పాటు నిర్వహణ వ్యయాలను సర్దుబాటు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ పేర్కొంది.
‘కంపెనీ, డీలర్ల స్థిరాభివృద్ధి కోసం ఈ ధరల సవరణ అత్యవసరం. మా విలువైన కస్టమర్లపై ఈ పెంపు భారం తక్కువగా ఉండేలా చూసేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లోనూ కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను గరిష్ఠంగా 2శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇతర కార్ల విక్రయాల కంపెనీలు కూడా వచ్చే ఏడాది నుంచి తమ ఉత్పత్తుల ధరలను సవరించనున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను 3శాతం మేర పెంచనున్నట్లు బీఎండబ్ల్యూ తెలిపింది. అంతకుముందే మెర్సిడెస్ బెంజ్ కూడా 3శాతం పెంపును ప్రకటించింది.