calender_icon.png 17 October, 2024 | 2:25 AM

ఎస్‌ఏఆర్ మిల్లు ఆస్తుల వేలం

17-10-2024 12:16:28 AM

సీఎంఆర్ కుంభకోణంలో ప్రభుత్వ చర్యలు 

ఖమ్మం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): సీఎంఆర్ కుంభకోణంలో రూ.80 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టిన వ్యవహారంలో ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో ఉన్న ఎస్‌ఏఆర్ రైస్‌మిల్లు ఆస్తుల వేలానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మిల్లుకు సంబంధించిన యజమాని గుండ్రాతిమడుగుకు చెందిన ఎం రామజ్యోతి భర్త బాలకృష్ణప్రసాద్ ప్రభుత్వానికి 2022 రబీ, 2023 ఖరీప్  సీఎంఆర్ బకాయిలకు సంబంధించి రూ.81కోట్ల 60 లక్షల 90వేల బాకీ పడ్డారు.

ఈ సొమ్మును చెల్లించాలని గతంలో జారీ చేసిన మొదటి నోటీస్ గడువు ముగిసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండో నోటీస్ జారీ చేశారు. రెండో నోటీస్‌కు కూడా గడువులోగా సంబంధిత డిఫాల్టర్ బాకీ సొమ్ము చెల్లించలేదు.

దీంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం డిఫాల్టర్ ఆస్తులను వేలం వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఈ కుంభకోణంలో ముగ్గురు, నలుగురు పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బందిపై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది.