calender_icon.png 15 November, 2024 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనాలివ్వకపోతే హాజరుకావాలె

10-11-2024 01:55:05 AM

  1. హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు హెచ్చరిక 
  2. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తీవ్ర ఆగ్రహం 

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీసు స్టేషన్లో స్వీపర్‌గా పనిచేసిన షేక్ జానిమియాకు 1991 నుంచి పూర్తివేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 2017లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పక్షంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పోలీస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్నా తనకు వేతనం చెల్లించకపోవడంతో షేక్ జానీమియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్పీ జారీచేసిన సర్వీస్ సర్టిఫికెట్ ఆధారంగా వేతనం చెల్లింపును పరిశీలించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసి, ఉపసంహరించుకున్నా వేతనం చెల్లించలేదు.

దీంతో బాధితుడు 2018లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్ జే అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్ గణేశ్ వాదనలు వినిపిస్తూ ఆరేళ్లు దాటినా కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పారు.

ఉత్తర్వుల అమలుకు మూడు వారాల గడువు కావాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తరఫున ప్రభుత్వ న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అనుమతించారు. ఇదే చివరి అవకాశమని సూచించారు. విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.