కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు
కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
కూకట్ పల్లి (విజయక్రాంతి): కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవపు ఆరోపణలు మానుకోవాలని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో చెక్కులు ఇవ్వడం లేదని విమర్శిస్తూ మాట్లాడిన మాటలకు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని శేరి సతీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన మీద కోపంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపకండి కూకట్ పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని పేర్కొని మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెపుతున్నారు కానీ ఇవ్వడం లేదని విమర్శించారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మీరు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఏ విధంగానైనా మిమ్మల్ని ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులకు గురి చేశారా? అనవసరమైన మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వన్ని అస్థిరపరిచే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రజల కోసం రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ అబద్ధాలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి విప్ మహేందర్ రెడ్డి, కూకట్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండి రమేష్ లపై విమర్శలు చేస్తే సహించ ప్రసక్తే లేదన్నారు.
రేపు ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే ఏంఆర్వో ఆఫీసు దగ్గర ధర్నా చేస్తా అని అన్నారు. ఏనాడైనా తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ధర్నా చేశావా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. 72 వేల మెజార్టీతో గెలిచానని జబ్బలు చరుచుకోవడం కాదు, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 72,000 ఓట్లు ఎక్కడికి పోయాయో ప్రజలకు తెలుపాలన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరు ఏమిటో అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, నియోజకవర్గం కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రేష్మ, నజీర్ బాయ్, అక్బర్, పిడికిటి గోపాల్ చౌదరి, శేషగిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.