calender_icon.png 29 September, 2024 | 2:58 AM

మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం

29-09-2024 01:01:36 AM

పోలీసుల అదుపులో నిందితుడు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో మూడేళ్ల బాలికపై 45 ఏళ్ల నందకుమార్ అనే వ్యక్తి శనివారం లైంగికదాడికి యత్నించేశాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికను పక్కింట్లో ఉండే నందకుమార్ తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

బాలికపై లైంగికదాడి 

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికపై బొమ్మెన సాగర్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బొమ్మెన సాగర్‌ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడ్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బూరుగుగూడలో రాస్తారోకో చేశారు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ సతీష్ చెప్పడంతో ఆందోళన విరమించారు. 

బాలికలతో హెచ్‌ఎం అసభ్య ప్రవర్తన

ఖమ్మం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): పాఠశాల విద్యార్థినులతో హెచ్‌ఎం అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన శనివారం వైరా మండలం పాలడుగులో చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ప్రధానోపాధ్యాయుడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎం ఈవో అక్కడికి రావడంతో ఆయనతోపాటు ఇతర ఉపాధ్యాయులను కొద్దిసేపు పాఠశాల గదిలో నిర్బంధించారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

జిల్లా విద్యాధికారి సోమశేఖర్ శర్మ కూడా పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై తల్లిదండ్రులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని డీఈవో హామీ ఇచ్చారు. వైరా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.