05-03-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్, మార్చి ౪ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలనం రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. బంగారం నిధి ఉన్నట్లు అనుమానిస్తూ ఇద్దరు మంత్రాగాళ్ళు 14 ఏళ్ల బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన గుర్తించిన స్థానికులు పథకం ప్రకారం వలపన్ని వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. కానీ గ్రామ మాజీ సర్పం కలగజేసుకొని గ్రామపంచాయతీలో 80 వేలకు జరిమానా విధిస్తూ పంచాయతీ సెటిల్ కొసమెరుపు.
ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలోని రామ్ రెడ్డి పల్లి తండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంతంలోని కొందరు దుండగులు బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలోని రామ్ రెడ్డి పల్లి తండాలో బంగారం నిధి ఉందని అనుమానిస్తూ క్షుద్ర పూజలు చేశారు.
అందులో 14 ఏళ్ల బాలికను నరబలి ఇస్తే తాము అనుకున్నట్లుగా బంగారం నిధి బయట పడుతుందని భావిస్తూ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను పాఠశాల నుంచి నేరుగా (హిప్నాటిజం) దృష్టి వశీకరణం వంటి విద్యలు చేసినట్లుగా బాలిక తాము చెప్పు చేతుల్లోనే క్షుద్ర పూజల వరకు వెంట బెట్టుకొచ్చినా ఏమాత్రం బెరుకు భయం లేకుండానే వారు చెప్పినట్లుగా వ్యవహరించింది.
తన ముందే పటం గీసి క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. క్షుద్ర పూజలకు తమలపాకు, రెండు రాళ్లు థమ్స్ అప్,; పసరు వంటి వాటితో పూజలు నిర్వహిస్తున్న క్రమంలో రెండు రాళ్లు గాల్లోకి ఎగిసి కొట్టుకోవడం వంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలికను కిందికి దించి తమ వెంట నడిపించుకు వెళ్తున్న తాను ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా కనిపించడంతో మంత్రగాళ్లు బాలికను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసం ఎలాంటి వస్తువులను వాడారోనన్ను చర్చ జోరుగా జరుగుతుంది.
ఈ విషయాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు పెద్దలకు సమాచారం ఇవ్వడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పం 80వేలు జరిమానా విధిస్తూ వారిని వదిలిపెట్టారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. అయినా తెర వెనుక కేసు నమోదు కాకుండా ఆ గ్రామ ప్రజా ప్రతినిధి పొలిటికల్ పవర్ వినియోగిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు డిఎస్పి బుర్రి శ్రీనివాసులు తెలిపారు. గుప్తనిధులు జరిగింది వాస్తవమేనని నరబలి అనే విషయంలో వాస్తవం లేదన్నారు.