కన్నాల గాంధీ నగర్ లో కలకలం
ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల గాంధీ నగర్ లో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో స్థానికురాలైన పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి యత్నించి విఫలమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి కన్నాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఒక బాలికను ఇద్దరు వ్యక్తులు తమ బైకుపై అనుసరిస్తూ వెంబడించారు. కన్నాల ప్రభుత్వ పాఠశాల వద్ద బాలికను అడ్డగించి ఆమెపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు.
బాలికకు రూ 5 వందల నోటు చూపిస్తూ లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో భయపడిన బాలిక వారి నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు 100 డయల్ కు ఫోన్ చేసి స్థానికులైన ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. 100 డయల్ సిబ్బంది గాంధీనగర్ లోని బాలిక ఇంటికి చేరుకొని ఈ ఘటనపై వివరాలు సేకరించారు. సదరు వ్యక్తుల కోసం గాలించగా వారు పరారయ్యారు. సోమవారం ఉదయం బాలికను వేధించిన ఇద్దరు వ్యక్తులు గాంధీనగర్లో తిరుగుతూ కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన కన్నాల గాంధీ నగర్ లో చర్చనీయాంశంగా మారింది.